Maa Elections 2021: సినిమా నటులకు ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం కొందరు తెలుగు నటులకు ఉండటం దురదృష్టకరం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రాంతీయతే ప్రధానం అయింది. ప్రాంతీయత విద్వేషాలు రెచ్చ గొట్టి గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ‘మా’ సంస్థ తెలుగు వాళ్ళ కోసం పెట్టుకున్నాం. మరి తెలుగు వాళ్ళ కోసం పని చేయడానికి తెలుగు వాళ్ళల్లో ఒకడు కూడా పనికి రాడా ?.. ఇది మంచు విష్ణు లేవనెత్తి భుజానికి ఎత్తుకున్న ప్రధాన ఎజెండా.

ఈ డిజిటల్ జనరేషన్ లో ఓటీటీ సంస్కృతి వచ్చాక సినిమాకి భాషతో పని లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ భాషా చిత్రాన్ని అయినా తెలుగు వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ ఆయన పై వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నాలు చేయడం, అందుకు తగ్గట్టుగానే కొందరు నటులు దానికి వత్తాసు పలకడం నిజంగా బాధాకరమైన విషయమే.
చరిత్ర చూసుకుంటే.. అసలు సినిమా నటులందరూ ప్రాంతీయవాదానికి వ్యతిరేకం. శ్రీలంకలో పుట్టి మలయాళీ అయిన ఎంజీఆర్ (MGR) తమిళనాడు మొదటి సూపర్ స్టార్ అయ్యాడు. తర్వాత ఏకంగా తమిళనాడు సీఎం అయ్యాడు. ఇక మన తెలుగువాడు విశాల్ నడిగర్ సంఘం నుంచి పోటీ చేసి గెలిచాడు. కరుణానిధి పూర్వీకులు మన ఆంధ్రులే. కానీ తమిళనాడును ఎక్కువ సంవత్సరాలు పాలించింది కరుణానిధి కుటుంబమే కదా.
అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక మరాఠీ. పుట్టి పెరిగింది కర్ణాటకలో. కానీ సూపర్ స్టార్ అయింది తమిళనాడులో. అందరికీ అమ్మ అయిన జయలలిత మైసూర్ వాసులు, వీరెవ్వరికీ ప్రాంతీయతతో పని లేకుండా ప్రజలు ఆరాధించారు. మరి అలాంటప్పుడు ఒక్క ప్రకాష్ రాజ్ కు మాత్రమే ఎందుకు ఈ ప్రాంతీయతను అంటగడుతున్నారు ?
దేశంలో ఎవరిది ఏ రాష్ట్రమైనా ముందుగా వాళ్ళు భారతీయులనే విజ్ఞతను ఎందుకు మరచిపోతున్నారు ? తెలుగు వాడు కాదంటూ విడదీస్తారా ? బయట వాళ్ళు మనకొద్దు అనే ద్వేష మనస్తత్వాన్ని ఎలా సమర్ధించాలి ? అలా అనుకుంటే దేవుళ్ళు కూడా వివిధ ప్రాంతాల్లో కొలువైయున్నారు. మరి దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టగలరా ? ఆ వైపరీత్య మనస్తత్వం వల్ల తెలుగు సినిమా పరిశ్రమకే నష్టమని పెద్దలు అయినా పెదవి విప్పి చెప్పాలి.