Salaar: సినిమాలపై తనకున్న ఆసక్తి అతడిని ఆ రంగంవైపు నడిపించింది. తనకు ఇష్టమైన రంగంలోకి ప్రవేశించేందుకు సొంతంగా ఓ కంప్యూటర్ కొనుక్కొని యూట్యూబ్ ద్వారా మెలకువలు నేర్చుకున్నాడు. అసిస్టెంట్ ఎడిటర్ గా రాణిస్తున్నాడు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కడెంకు చెందిన కుర్రాడు రామగిరి విష్ణు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. హీరో ప్రభాస్ నటించిన సలార్ చిత్రానికి అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు.
డిగ్రీ చదువుతూనే..
విష్ణు హైదరాబాద్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు శ్రీనివాస్– లత. తండ్రి దర్జీ పనిచేస్తుంటారు. విష్ణు ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతూనే సినిమారంగంపై ఉన్న మక్కువతో ఎలాగైనా అందులో చేరాలని ఎడిటింగ్ విభాగంలో మెలకువలను నేర్చుకున్నాడు. యూట్యూబ్ ద్వారా ఎప్పటి కప్పుడు తన అనుమానాలు నివృత్తి చేసుకుంటూ తాను చేసిన ఎడిటింగ్‌లను చిత్ర దర్శకులకు పంపించాడు.
సలార్‌లో ఛాన్స్..
సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు రామగిరి విష్ణు ఎడిటింగ్ నచ్చింది. దీంతో అవకాశం ఇవ్వడంతో సినిమాలో పనిచే మొదటిసారే అగ్రహీరో సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసి రాణించాడు. సినిమా సూపర్ హిట్ కావడంతో తెరవెనుక రామగిరి విష్ణు కృషిని అందరూ అభినందిస్తున్నారు.
మ్యాడ్ సినిమాకూ..
గతంలో కల్యాణ్ దర్శకత్వంలో విడుదలైన మ్యాడ్ సినిమాకు సైతం ఈయన పనిచేశాడు. ప్రస్తుతం గ్యాంగ్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్ చిత్రాలకు సైతం అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన విష్ణు సొంతంగా నేర్చుకుని ఈ రంగంలోకి వెళ్లడంతో మిత్రులు, కడెం వాసులు అభినందిస్తున్నారు. మున్ముందు మరిన్ని మంచి సినిమాల్లో పనిచేసే అవకాశం రావాలని ఆకాంక్షిస్తున్నారు.