Tollywood : ప్రతి ఒక్కరూ మంచి ముగింపు కోరుకుంటారు. ఇక సినిమా విజయాన్ని క్లైమాక్స్ డిసైడ్ చేస్తుంది. రెండు గంటల సినిమా ఎలా ఉన్నా చివర్లో ఆ పదిహేను నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు కిక్ ఫీల్ అవుతారు. కాగా డిసెంబర్ నెల వచ్చేసింది. మరో ముప్పై రోజుల్లో 2022 కి ఎండ్ కార్డు పడనుంది. ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్, కార్తికేయ 2, సీతారామం, బింబిసార, డీజే టిల్లు చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. థియేటర్స్ కి కల తెచ్చాయి. గత రెండేళ్లలో పోల్చుకుంటే మంచి ఆరంభమే లభించదని చెప్పొచ్చు.

ఆర్ ఆర్ ఆర్ తో గొప్పగా స్టార్టై… సీతారామం, బింబిసార, కార్తికేయ 2 చిత్రాలతో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. ఇక క్లైమాక్స్ లో దుమ్ము రేపాల్సిన బాధ్యత రవితేజ, అడివి శేష్, విశాల్, నిఖిల్ లపై ఉంది. గత ఏడాది డిసెంబర్ అద్భుతం చేసింది. పుష్ప, అఖండ భారీ విజయాలు నమోదు చేశాయి. ముఖ్యంగా అఖండ పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది. నాని శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2021 డిసెంబర్ టాలీవుడ్ బెస్ట్ పీరియడ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.
ఆ రేంజ్ క్లైమాక్స్ ఊహించడం అత్యాశే అవుతుంది. అయితే 2022 డిసెంబర్ లో విడుదలవుతున్న చిత్రాలను తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా అడివి శేష్ హిట్ 2 పై పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్ ఓ రేంజ్ లో పేలింది. ఇది పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు. ప్రేక్షకులు మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్స్ తో హిట్ 2 అలరించడం ఖాయమంటున్నారు.
ఇక హీరో నిఖిల్ కార్తికేయ 2 మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. కార్తికేయ 2 ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా హిట్ కొట్టింది. కార్తికేయ 2 హ్యాంగ్ ఓవర్ నుండి ఇంకా ప్రేక్షకులు బయటకు రాలేదు. నిఖిల్ మాత్రం 18 పేజెస్ తో రొమాంటిక్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాతలుగా 18 పేజెస్ డిసెంబర్ లో విడుదల కానుంది.
18 పేజెస్ కి మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మళ్ళీ కాసుల వర్షమే. మాస్ మహారాజ్ ధమాకా తో జూలు విదిలించేలా ఉన్నాడు. క్రాక్ తో బంపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రూపంలో రెండు ప్లాప్స్ ఇచ్చారు. ధమాకా తో భారీ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని టాలీవుడ్ టాక్. రవితేజ మ్యాజిక్ వర్క్ అవుట్ అయితే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బింగ్ మూవీ లాఠీ, ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ తో మరో మూవీ ఈ నెలలో విడుదల కానున్నాయి. ఈ చిత్రాలను కూడా తక్కువ అంచనా వేయలేం. కీలక పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న ఈ హీరోలు ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.