Karate Kalyani: కరాటే కళ్యాణి చేసిన తప్పేంటి? అగ్రకుల అహం దెబ్బతిందా?

కరాటే కళ్యాణి వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆమె వివరణ సంతృప్తికరంగా లేదని మా సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Written By: Shiva, Updated On : May 26, 2023 5:24 pm

Karate Kalyani

Follow us on

Karate Kalyani: కరాటే కళ్యాణి ‘మా’ సభ్యత్వ రద్దు టాలీవుడ్ హాట్ టాపిక్. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన కారణంగా ఆమెకు ఈ శిక్ష పడింది. ఖమ్మంలో మే 28న శ్రీకృష్ణుడు అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీన్ని యాదవ సంఘాలు వ్యతిరేకించాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే శ్రీకృష్ణుని అవతారంలో విగ్రహ ప్రతిష్ట చేయడం తగదన్నారు.

కోర్టు వరకు విషయం వెళ్ళింది. హైకోర్టు యాదవ సంఘాలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నిలిపివేయాలని స్టే ఆర్డర్ ఇచ్చింది. కరాటే కళ్యాణి ఈ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఆమె వాయిస్ గట్టిగా వినిపించారు. ఈ క్రమంలో ఆమె కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు, ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప పరిణామం. అయితే దేవుని రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం తగదు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ దేవుని పాత్రలు చేశారు. అంతే కానీ ఆయన దేవుడు కాదన్నారు.

కరాటే కళ్యాణి వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆమె వివరణ సంతృప్తికరంగా లేదని మా సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఒక రాజకీయ వ్యవహారం. సాధారణంగా నాయకుల విగ్రహాల ఆవిష్కరణ వెనుక రాజకీయ ప్రయోజనాలే ప్రధానం. ఒక సామాజిక వర్గం లేదా అభిమానుల మెప్పు పొందేందుకు పార్టీల నేతలు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఈ గొడవతో మా కు అసలు సంబంధం లేదు.

ఎన్టీఆర్ నటుడు అయినప్పటికీ వివాదం సినిమా పరిశ్రమకు సంబంధించింది కాదు. అదే సమయంలో కరాటే కళ్యాణి ఎన్టీఆర్ కించపరుస్తూ ఎక్కడా మాట్లాలేదు. ఎన్టీఆర్ దేవుడు కాదు, దేవుని రూపంలో విగ్రహ ఏర్పాటు తగదన్నారు. దీన్ని తప్పుగా పరిగణించి మంచు విష్ణు ఆమెపై చర్యలు తీసుకున్నాడు. మా సభ్యత్వ రద్దు చిన్న శిక్షేమీ కాదు. కరాటే కళ్యాణి వంటి చిన్న ఆర్టిస్ట్ కి ఆత్మహత్యా సదృశ్యం. చెప్పాలంటే ఆమె కెరీర్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆమె భృతితో పాటు మా సభ్యురాలిగా అందే ప్రయోజనాలు కోల్పోతారు.

కరాటే కళ్యాణి ఒక బీసీ మహిళ కాబట్టే అన్యాయంగా శిక్షించారనే వాదన తెరపైకి వచ్చింది. మా అధ్యక్షుడితో పాటు ఉన్నత పదవుల్లో ఉన్నవారందరూ ఉన్నత సామాజిక వర్గం వారు. చెప్పాలంటే ఎన్టీఆర్ వారి సామాజిక వర్గానికి చెందినవారు. దశాబ్దాలుగా పరిశ్రమలో ఆధిపత్యం వారిదే. దీంతో ఒక మైనారిటీ నటి వారిని వ్యతిరేకించినట్లు, ప్రశ్నించినట్లుగా భావిస్తున్నారు. వాళ్లకు ఎదురొస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలియజేశారు. కేవలం వారి అహం దెబ్బతినడంతో కరాటే కళ్యాణి సభ్యత్వం రద్దు చేశారని పలువురి వాదన.

గతంలో పరిశ్రమకు చెందిన పలువురు నటులు రాజకీయ, సినీ వివాదాలకు తెరలేపారు. కొందరు నటులను వ్యక్తిగతంగా దూషించారు. అప్పుడు మా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ని దారుణ పదజాలంతో విమర్శించారు. పోసానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆయన అగ్ర కుల నటుడనా? అంతెందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పరువును, తెలుగు సినిమా ప్రతిష్టను దిగజార్చి మాట్లాడినవాళ్లు ఉన్నారు. వాళ్లను మా ఎందుకు వివరణ కోరలేదు? కరాటే కళ్యాణి మా సభ్యత్వ రద్దు బీసీ మహిళపై అగ్రకుల అహంకార ధోరణిగానే చూడాలని సామాజిక వాదులు అభిప్రాయపడుతున్నారు.