Venkatesh
Venkatesh : ఒక భారీ కమర్షియల్ హిట్ తర్వాత, ఏ స్టార్ హీరోకి అయినా తదుపరి చిత్రం ఎలాంటిదైతే బాగుంటుంది?, ఆడియన్స్ ఎలాంటి సినిమా చేస్తే ఆదరిస్తారు అనే దానిపై స్పష్టమైన క్లారిటీ ఉండదు, కాస్త తడబడుతుంటారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) పరిస్థితి కూడా అలాంటిదే. గత రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా కనీసం పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఉన్న సినిమా కూడా లేని విక్టరీ వెంకటేష్ కి, ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం తో ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంతటి భారీ వసూళ్లు వస్తాయని మూవీ టీం కూడా ఊహించలేదు. వెంకటేష్ అయితే ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాడు.ఒక్కసారిగా ఇంతటి భారీ హిట్ రావడంతో తదుపరి చిత్రం పై వెంకటేష్ తర్జన భర్జన పడుతున్నాడు. ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ అంచనాలను అందుకుంటామా అని ఆయన ఆలోచిస్తున్నాడు.
ఈ చిత్రానికి ముందు ఆయన రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. అందులో ఒకటి ‘సమజవరగమనా’ దర్శకుడు రామ్ అబ్బరాజు తో ఉండగా, మరొకటి వెంకీ అట్లూరి సినిమా. ఈ రెండు చిత్రాలు ఆయన ఇమేజ్ కి సరిపోయేవి అవ్వడం , అవి ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడు. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలను ప్రస్తుతానికి వెంకీ పక్కన పెట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఎదో కొత్తగా చేయాలనీ అనుకోవడమే. అందుకోసం స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈమధ్యనే వెంకటేష్ కి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న కథని వినిపించాడట. వెంకటేష్ కి అసలు నచ్చలేదని సమాచారం. అయితే ఎప్పటి నుండో ఆయన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా ప్రకటించారట కూడా.
త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇది పెద్ద స్పాన్ ఉన్న మైథాలజీ జానర్ కావడంతో బాగా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సినిమాకంటే ముందు అట్లీ తో చేయబోయే సినిమాని ప్రారంభించడానికి అల్లు అర్జున్ అమితాసక్తిని చూపిస్తున్నాడు. అందుకే త్రివిక్రమ్ ఈలోపు వెంకటేష్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ అట. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఎంత స్టామినా ఉందో స్వయంగా కళ్లారా చూసిన వెంకటేష్, ఇక నుండి తన ప్రతీ సినిమాని సంక్రాంతికి విడుదల చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి రాబోయే రోజుల్లో వెంకటేష్ ఈ ఊపుని ఇలాగే కొనసాగిస్తాడా లేదా అనేది. త్వరలోనే వెంకటేష్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు.