
Oscor Rajamouli : ఇండియన్ సినిమాకు ఆస్కార్ అందరి ద్రాక్ష. చెప్పాలంటే మన దర్శకులకు నటులకు సాంకేతిక నిపుణులకు ఆ ఊహ కూడా రాదు. ఆస్కార్ మనకు సంబంధం లేని మేటర్ అన్నట్లు చూస్తారు. ఆ సినిమాకు ఆస్కార్ వచ్చింది ఈ నటుడు ఆస్కార్ గెలుచుకున్నాడని వినడం, చదవడమే కానీ… ఇండియన్ సినిమాకు ఆస్కార్ వచ్చిందని చెప్పుకున్న దాఖలాలు లేవు. ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్స్ కొద్దిమంది ఉన్నారు. వారు కూడా హాలీవుడ్ చిత్రాలకు పని చేసి తెచ్చుకున్నవారే.గాంధీ, స్లమ్ డాగ్ మిలియనీర్ హాలీవుడ్ మేకర్స్ తెరకెక్కించిన చిత్రాలు.
తలచుకుంటే ఆస్కార్ అసాధ్యం కాదు. మంచి సినిమా తీస్తే, దాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగితే సాధ్యమే అని నిరూపించారు రాజమౌళి. ఆస్కార్ వేదికపై రాజమౌళి సక్సెస్ జర్నీ మీద ఒక పుస్తకం రాయొచ్చు. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అక్కడకు తీసుకెళ్లేందుకు చాలా తతంగమే నడిచింది. రాజమౌళి దీని మీద పెద్ద అధ్యయనం చేశారు. ప్రణాళిక ప్రకారం వెళ్లి సక్సెస్ అయ్యారు.
వాస్తవం మాట్లాడాలంటే ఆర్ ఆర్ ఆర్ కి మించిన గొప్ప సినిమాలు ఇండియాలో దశాబ్దాల క్రితమే తెరకెక్కాయి. అయితే అవి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లబడలేదు. ఇండియన్ సినిమాకు వరల్డ్ వైడ్ గుర్తింపు లేదు. ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనుకుంటారు. ఇక రీజనల్ భాషల్లో తెరకెక్కే సినిమాల గురించి అంతర్జాతీయంగా అవగాహన లేదు. కే విశ్వనాథ్ తెరకెక్కించిన ప్రతి ఆర్ట్ ఫిల్మ్ కి పలు ఆస్కార్స్ ఇవ్వాలి. కానీ ఎందుకు రాలేదంటే… అవార్డు రావాలంటే గుర్తించాలి కదా. ఆస్కార్ కమిటీ మెంబర్స్ కి మన సినిమా అంటే ఏమిటో తెలియజేయాలి.
ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి చేసింది అదే. విడుదలైనప్పటి నుండి దీని మీద కసరత్తు చేశారు. ఏ మార్గమైనా ఎంచుకోనీ… ఆర్ ఆర్ ఆర్ ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. దానికి అమెరికాను వేదికగా ఎంచుకున్నారు. కారణం… హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ గా ఉంది. స్థానిక మీడియా, యాక్టర్స్, సాంకేతిక నిపుణులు ఆర్ ఆర్ ఆర్ గురించి మాట్లాడేలా చేశారు. ఆ విధంగా ఆస్కార్ కమిటీని ఇంప్రెస్ చేసి ఆస్కార్ కొల్లగొట్టారు. ఇకపై ఏ ఇండియన్ ఆస్కార్ గెలవాలన్నా రాజమౌళిని ఫాలో అయితే సరిపోతుంది. చెప్పాలంటే ఆయన వద్ద ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. బట్… ఆస్కార్ ఆశించే వాళ్ళ సినిమాలో కూడా మేటర్ ఉండాలి.