Waltair Veerayya pre Release : వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేదికగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రిరిలీజ్ వేడుకను ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి తన చిరకాల కోరికను ఒకదాన్ని బయటపెట్టాడు.

తనది మొగల్తూరు అని.. ఈ ప్రాంతంలోనే పుట్టానని.. పక్కనే ఉన్న వైజాగ్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. ఇక్కడే తిరిగాను.. పెరిగాను.. అందుకే ఈ సుందర సముద్ర ఒడ్డున ఉండాలన్నది తన చిరకాల కోరిక అని.. అందుకే విశాఖలో స్థలం కొన్నానని చిరంజీవి సంచలన విషయాన్ని బయటపెట్టాడు. విశాఖ సముద్ర తీరాన స్థలం కొన్నానని.. ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకొని హాయిగా ఈ బీచ్ ఒడ్డున నడుస్తూ జీవించాలన్నది తన కల అని.. అది నెరవేరబోతోందని చిరంజీవి అన్నారు. త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తానని చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా వైజాగ్ గొప్పతనం గురించి వివరించారు. విశాఖలో విశాలమైన మనసు ఉన్న ప్రజలు ఉన్నారని.. ఈ నగరం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కొనియాడారు. ఇక్కడ ప్రజల్లో కుళ్లు కుతంత్రాలు లేవని.. ఎంతో సరదాగా ఉంటారని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ సెటిల్ కావాలని కోరుకుంటారని.. నాకు కూడా అలాంటి చిరకాల కోరిక ఉందని చిరంజీవి అన్నారు. అందుకే విశాఖలో స్థలం కొన్నానని.. ఇల్లు కట్టి విశాఖ పౌరుడు అవుతానని చిరంజీవి తన చిరకాల కోరికన ప్రిరిలీజ్ వేడుకలో బయటపెట్టారు.
దీన్ని బట్టి చిరంజీవి తన రెండో ఇల్లును విశాఖలోనే పెట్టుకుంటాడని.. సినిమాలు షూటింగ్ లు లేనప్పుడు విశాఖ సముద్రం ఒడ్డున సేదతీరుతాడని తెలుస్తోంది.
