Vimanam Movie Twitter Talk: అనసూయ వేశ్య రోల్ చేసిన విమానం మూవీ నేడు విడుదలైంది. విమానం చిత్రం తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ. కొడుకు కోరిక తీర్చడం కోసం తపించే అవిటి తండ్రిగా సముద్రఖని నటించారు. పేదవాడైన సముద్రఖని కొడుక్కి విమానం అంటే చాలా ఇష్టం. విమానం ఎక్కించమని తండ్రిని పదే పదే అడుగుతుంటాడు. ఆ పిల్లాడికి క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. దాంతో కొడుకు చివరి కోరిక తీర్చాలని సముద్రఖని అనుకుంటాడు. కానీ విమాన టికెట్ కొనే స్తోమత సముద్రఖనికి ఉండదు. మరి పేదవాడైన సముద్రఖని కొడుకు కోరిక తీర్చడా? వీరి కథలో వేశ్య అయిన అనసూయ పాత్ర ఏమిటనేదే విమానం మూవీ.
విమానం మూవీ నేడు విడుదలైంది. ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. కొత్త దర్శకుడు శివ ప్రసాద్ చాలా వరకు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడనే వాదన వినిపిస్తోంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ హృద్యంగా తెరకెక్కించాడు. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని పేదరికం, స్లమ్ ఏరియాలో అరకొర సంపాదనతో బ్రతుకులీడ్చే జనాల జీవన విధానం, వారి కోరికలు, ఆలోచనలు ఎలా ఉంటాయో వెండితెరపై ఆవిష్కరించాడంటున్నారు.
కొద్దిరోజుల్లో చచ్చిపోయే కొడుకు చివరి కోరిక తీర్చడం కోసం తండ్రి పడే ఆవేదన, దాని తాలూకు సన్నివేశాలు ఎమోషనల్ గా సాగాయి. దర్శకుడు తండ్రి కొడుకుల డ్రామా చక్కగా నడిపారు. ఒక ఎమోషనల్ స్టోరీ చెబుతూ కామెడీ యాంగిల్ వదిలిపెట్టలేదు. సముద్రఖని కొడుకు స్కూల్ సన్నివేశాలు కామెడీ పంచుతాయి. అలాగే అనసూయ-రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయంటున్నారు.
అనసూయ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. వేశ్యగా ఆమె పరకాయ ప్రవేశం చేశారు. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ గా నటించింది. ఇక ఆ వెయ్యి రూపాయల కోసం రాహుల్ రామకృష్ణ పాట్లు చక్కగా చుపించారంటున్నారు. సాంకేతిక విషయాలు పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. చివర్లో మీరా జాస్మిన్ ట్విస్ట్ తో కూడిన ఎంట్రీ సైతం బాగుందంటున్నారు.
అయితే సినిమాలో ఒకింత డ్రామా ఎక్కువైంది. సాగతీత సన్నివేశాలు ఉన్నాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడని అంటున్నారు. ఈ లోపాలు మినహాయిస్తే ఓ ఎమోషనల్ డ్రామాను ఆసక్తికరంగా నడపడంతో దర్శకుడు సఫలం చెందాడన్న మాట వినిపిస్తోంది. కాబట్టి అనసూయకు హిట్ పడ్డట్లే అనుకోవచ్చు.