Homeఎంటర్టైన్మెంట్Veteran Singer Vani Jayaram : 19 భాషలు, 20 వేల పాటలు.. అది ఒక్కటి...

Veteran Singer Vani Jayaram : 19 భాషలు, 20 వేల పాటలు.. అది ఒక్కటి తీసుకోకపోవడమే వాణిజయరాం లోటు

Veteran Singer Vani Jayaram : ఆమె స్వరం మధురంగా ఉంటుంది.. పాడితే అద్భుతంగా ఉంటుంది.. శ్రావ్యంగా ఆలపిస్తుంటే కరుణా రసం ఉప్పొంగుతుంది. భక్తి గీతం ఆలపిస్తే ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది.. 19 భాషల్లో 20వేల పాటలు పాడింది ఆమె గొంతు.. ఇలా చెప్పుకుంటూ పోతే వాణి జయరాం ఘనత అంచనాలకు అందదు. వాస్తవానికి వాణీ జయరాం గాత్ర మాధుర్యాన్ని వివరించేందుకు కొలమానాలు సరిపోవు. 11 సంగీత ప్రధానమైన పాటలున్న స్వాతికిరణం సినిమా కోసం విశ్వనాధ్ విశ్వహమాటంగా ఆమె నే ఎంచుకున్నాడు. ఆమె పాటంటే, పాడే పద్ధతి అంటే అందరికీ అంత నమ్మకం మరి.

ఆనతి నీయరా హరా… శివాని, భవాని.. తెలిమంచు కురిసింది.. ఈ పాటలు చర్విత చరణం లాగా వినిపిస్తూనే ఉంటాయి.. ఎన్నిసార్లు విన్నా పాటల్లో గొప్ప భావాన్ని పరిచయం చేస్తాయి.. ఒక సుశీల, ఒక జానకి, ఒక లతా మంగేష్కర్, ఒక ఆశ బోంస్లే… వీరందరూ గ్రేట్. వారి గొంతులు మొత్తం ఒకచోట కుప్ప పోస్తే ఆమె వాణి జయరాం.

ఇవో అవో గుర్తు చేసుకోవడం దేనికి? అదే విశ్వనాథ్ తీసిన సినిమా శృతిలయల్లో “ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఇన్ని రాసుల ఉనికి” పాటలు కూడా అనితర మధురమే కదా.. జగమెరిగిన శంకరాభరణం లో “బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ, ఏ తీరుగా నన్ను దయ చూచెదవో, మానస సంచరరే”… అన్ని ఆమె గాత్ర జననాలే.. “పూజలు సేయ పూలు తెచ్చాను” పాటను పరవశంతో వినని చెవులు చెవులేనా? “విధి సేయు వింతలన్నీ” అంటూ మరోచరిత్రలో పలవరిస్తుంది. భక్తి పాటలే కాదు, రక్తి పాటలు కూడా అంతే అబ్బురంగా పాడి మెప్పించింది.. వయసు పిలిచింది సినిమాలో “నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా” అని గోముగా ఆటపట్టిస్తూ.. ఆకాంక్ష రేపుతూ సాగుతుంది ఈ గీతం. సీతాకోకచిలుకలో “మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, అలలు కలలు” పాటలు ఈ రోజుకూ చిరగాననీయమే..

స్వర్ణకమలంలో “అందెల రవళిది” పాట ఆమె నోట కన్నా శ్రావ్యంగా ఎవరు పాడగలరు? తెలుగులో ఎక్కువగా సంగీత ప్రధానమైనవి, భావాత్మకమైనవి మాత్రమే ఆమెతో పాటించారనేది కరెక్ట్ కాదు.. ఉదాహరణకు ఘర్షణ సినిమా కోసం ఆమెతో “రోజాతో లేత వన్నెలే, ఒక బృందావనం, కురిసేను విరిజల్లులే” వంటి కమర్షియల్ చాయలు ఉన్న పాటల్ని కూడా పాటించారు. అవి ఎంత సూపర్ హిట్టో తెలుసు కదా.. చెబుతూ పోతే జాబితా తెగదు.

నిజానికి సుశీల, జానకి ప్రబల్యాన్ని తట్టుకొని నిలబడింది వాణి జయరాం మాత్రమే కావచ్చు. సంఖ్యను పక్కన పెడితే పాటల్ని ఎంత జన రంజకంగా పాడిందో ప్రామాణికం.. ఆ పరీక్షలో వాణిది ప్రతిపాటలోనూ డిస్టింక్షనే. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆమెకు ఎక్కువగా సింగర్ బాలసుబ్రమణ్యమే.. సోలో సాంగ్స్. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు ఆమె సొంతం. ఆమె పాడిన భాషలు తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం మాత్రమే కాకుండా గుజరాతి, మరాఠీ, మార్వాడి, హరియాన్వి, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్, భోజ్ పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తులు.. ఇంకేం మిగిలాయని.. 77 ఏళ్ల వయసు వరకు ఆమె సార్ధక జీవితాన్ని గడిపింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అందుకొని ఉంటే మరింత బాగుండేది. కానీ “విధి సేయు వింతలన్నీ” ఆమె ఏదో సినిమాలో పాట పాడినట్టు.. మన చేతిలో మాత్రం ఏముంది?.. ఆ ఘనమైన గాయానికి నివాళులు అర్పించడం తప్ప..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular