Sankranti Ainyaam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వండర్స్ ని చూసి ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యింది. నేటి తరం స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయితే ఎలాంటి వసూళ్లు వస్తాయో, ఈ చిత్రానికి అలాంటి వసూళ్లు వస్తున్నాయి. వరుసగా 18 రోజులపాటు నాన్ స్టాప్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుండి 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లు 150 కోట్ల రూపాయలకు పైమాటే. ఇంతటి సంచలన విజయం సాదిస్తుందని ఈ సినిమా మేకర్స్ కూడా ఊహించి ఉండరు.
‘గేమ్ చేంజర్’ చిత్రానికి జరగాల్సిన అద్భుతాలు ఈ చిత్రానికి జరిగాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘అలా వైకుంఠపురంలో’. ఈ సినిమా రికార్డు ని ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోలు అందుకోలేదు. పాన్ ఇండియన్ సినిమాలు చేసి అధిగమించారు కానీ, ప్రాంతీయ భాష చిత్రాలతో మాత్రం అధిగమించలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు కూడా విఫలం అయ్యారు. అలాంటిది విక్టరీ వెంకటేష్ ‘అలా వైకుంఠపురంలో’ వసూళ్లను దాటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు. ఈరోజు, రేపటితో ఇది జరగొచ్చు. ఈ రెండు రోజుల్లో మిస్ అయితే, వచ్చే వారంలో అయినా కచ్చితంగా జరగొచ్చు. అదే కనుక జరిగితే ఇది విక్టరీ వెంకటేష్ కి మూడవ ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు.
గతంలో ఆయన హీరో గా నటించిన ‘చంటి’, ‘కలిసుందాం రా’ చిత్రాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన ఇండస్ట్రీ హిట్ ని అందుకొని తన స్టామినా ఏమిటో మరోసారి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు. ఆరు పదుల వయస్సు దాటిన తర్వాత వెంకటేష్ కి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ అందరికి వచ్చిన లాభాలను లెక్కేస్తే వంద కోట్ల రూపాయలకు పైనే ఉంది. ఈమధ్య కాలం లో ఈ స్థాయి లాభాలను రాబట్టిన సినిమా మరొకటి లేదు అని చెప్పొచ్చు. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు విడుదలైన అన్ని సంక్రాంతి సినిమాలకంటే, ఈ చిత్రానికే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.