spot_img
Homeఎంటర్టైన్మెంట్Veerabhadrudu Review: తమిళ మాస్ మసాలా వీరభద్రుడు రివ్యూ

Veerabhadrudu Review: తమిళ మాస్ మసాలా వీరభద్రుడు రివ్యూ

Veerabhadrudu Review: నటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి నటరాజ్, స్వసిక, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు తదితరులు

సంగీత దర్శకుడు: సాయి అభ్యంకర్

ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు

ఎడిటర్: ఆంథోనీ

దర్శకుడు: ఆర్జే బాలాజీ

నిర్మాత: ఎస్.ఆర్. ప్రభు

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి సూర్య ఈమధ్య నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీంతో రూటు మార్చి మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఒక ఫాంటసీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆర్థికపరమైన కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా నేడు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల సంగతి దేవుడెరుగు సాదా సీదా అంచనాలు కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

పోలీసు స్టేషన్లకు పోతే మంచి జరుగుతుందన్న నమ్మకం, కోర్టు మెట్లెక్కితే న్యాయం జరుగుతుందన్న భరోసా ఎక్కువశాతం ప్రజల్లో లేదు ఆనే మాట నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో ఏటికెదురీదుతూ బాధితులకు న్యాయం ఎలా అందేలా చేశారు ఆనే థీమ్ తో ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీరభద్రుడు ఇదే థీమ్ లో తెరకెక్కిన సినిమా. ఆ థీమ్ కు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాకే ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాంపల్లి కోర్టులో కొంతమంది లాయర్లు సిండికేట్ గా మారి అక్కడికి వచ్చే బాధితులను పీడిస్తూ ఉంటారు. వారిని బెదిరించి, కేసులను ఆలస్యం చేసి డబ్బు గుంజుతూ ఉంటారు. ఆ కోర్టులో ఎవరికీ న్యాయం జరగదు. ఇలానే ఇంద్రన్స్ కూతురికి అన్యాయం జరుగుతుంది. దీంతో చలించిపోయిన అతను కోర్టు బయట ఉన్న వీరభద్రుడి విగ్రహం దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని వేడుకుంటాడు. అప్పుడు వీరభద్రుడు మనిషి అవతారం లో ఎంట్రీ ఇచ్చి సిండికేట్ లాయర్లలో ఒకరైన RJ బాలాజీ బెదిరిస్తాడు, బాధితుడికి న్యాయం చేయమని అల్టిమేటమ్ ఇస్తాడు. అయితే అతను బెదరకుండా, కోర్టుల్లో అవినీతి, బంధుప్రీతి లాంటివి కామన్ అని, నువ్వు చెప్పిన వ్యక్తికి న్యాయం చేయాలంటే డబ్బు, లంచాలతో పని చేయిస్తా అంటాడు. వీరభద్రుడు అందుకు ఒప్పుకోడు. అప్పుడు RJ బాలాజీ వీరభద్రుడితో ఈ కోర్టులో మీ మాట చెల్లదు అని, మీకు చేతనైతే వచ్చి కేసు వాదించి గెలవాలని సవాల్ చేస్తాడు. వీరభద్రుడు అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దైవాంశతో వచ్చిన వీరభద్రుడు కోర్టులో న్యాయం వైపు నిలబడి బాధితులకు ఊరటనిచ్చారా? కోర్టుల్లో ఏలాంటి మార్పులు తీసుకొచ్చారు అనేది మిగతా కథ. గ్రామీణ నేపథ్యంలో మొదలైన ఈ కథ, వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ, అన్యాయంపై ఒక అతీంద్రియ శక్తి చేసే పోరాటంగా సాగుతుంది.

దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక మాస్ ఎంటర్టైనర్ కు ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో కథా నేపథ్యం, సూర్య ఎంట్రీ మరియు విజువల్స్ తో సినిమా వేగంగా సాగుతుంది. ముఖ్యంగా సూర్యను ఒక పవర్ ఫుల్ గార్డియన్ (శక్తి) గా చూపించిన విధానం డిఫరెంట్ గా ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినప్పటికీ చివరివరకూ అదే టెంపో కొనసాగించలేకపోయారు. ఎప్పుడైతే ఒక దైవిక శక్తి అన్యాయాలపై పోరాటానికి పూనుకుందో అక్కడ కథలో ఆటోమేటిక్ గా ఆసక్తి సన్నగిల్లింది. మరొక అంశం ఏంటంటే, ఈ సినిమాలో ఒకవైపు యాక్షన్, మరోవైపు అఖండ టైపు శక్తి, ఇంకోవైపు కోర్టుల లో జరిగే అవినీతి, అంతులేని ఆలస్యం లాంటి సమస్యలు.. ఇలాంటివి నాలుగైదు ఉండడంతో సినిమా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడా ప్రిడిక్టబుల్ గా, బోరింగ్ గా అనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. స్క్రిప్టును ఇంకాస్త టైట్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా బెటర్ గా ఉండేదేమో. ఇప్పటికైతే మాస్ మసాలా మిక్చర్ లాగా ఉంది. పెద్ద రిలీఫ్ ఏంటంటే హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ ను మరింత పెంచకపోవడం.

సూర్య మరోసారి తన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో సూర్య ఇంటెన్సిటీ అదిరిపోయింది. వీరభద్రుడి అవతారంలో సూర్య డ్యాన్స్ పుష్పలో అల్లు అర్జున్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినట్టుగా అనిపించింది. అడ్వొకేట్ గా త్రిష తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమా దర్శకుడు RJ బాలాజీ అడుగడుగునా సూర్యకు అడ్డుతగిలే సిండికేట్ లాయర్ పాత్రలో చక్కగా నటించాడు, ఓ వైపు విలనీ మరోవైపు కామెడీతో ఆకట్టుకున్నాడు. సపోర్టింగ్ కాస్ట్ లో ఇంద్రన్స్ మరియు నట్టి కీలక పాత్రల్లో మెప్పించారు.

సాయి అభ్యంకర్ పాటలు సొసోగా ఉన్నాయి కానీ నేపథ్య సంగీతం కొత్త ఫ్లేవర్ తో సాగింది. తమిళ మాస్ అనగానే తప్పెట్లు కొట్టడం అన్నట్టు కాకుండా ఫ్రెష్ ఫీల్ తో సాగింది. జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా వీరభద్రుడు రెడ్ కలర్ నేపథ్యంలో వచ్చే షాట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. సూర్య నటన

2. కొత్త తరహా ఫాంటసీ కథాంశం

3. మాస్ ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ సీన్స్

సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సాగదీత

2. ప్రిడిక్టబిలిటీ

రేటింగ్: 2.5/ 5

ఫైనల్ వర్డ్: సమ్మర్ లో టైమ్ పాస్ తమిళ మసాలాను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయవచ్చు. ప్రతి లాజిక్ ను పట్టి పట్టి చూస్తాం, దేవుళ్ళు లేరు దెయ్యాలు లేరు అని కఠిన కఠోర వాదనలు చేసే వేదాంతులు ఈ సినిమా థియేటర్లకు లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండండి.

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular