Varasudu Release Postponed: 2023 సంక్రాంతి దిల్ రాజు చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏం చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక వారసుడు చిత్ర విడుదల తేదీని ఆయన వెనక్కి ముందుకు జరుపుతున్నారు. ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎట్టకేలకు వారసుడు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు మొదట వారసుడు జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు వీరసింహారెడ్డి విడుదల అవుతుంది. వారసుడు ట్రైలర్ లో విడుదల తేదీ పొందుపరచలేదు. దీంతో దిల్ రాజు మనసులో వేరే ఆలోచన ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.

అనుకున్నట్లే వారసుడు జనవరి 12కి బదులు 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిన్నటి నుండి వారసుడు విడుదల తేదీ మారనుంది అంటూ ప్రచారం మొదలైంది. నేడు దిల్ రాజు అధికారికంగా వారసుడు విడుదల తేదీ ప్రకటించారు. వారసుడు జనవరి 14న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తన ఈ నిర్ణయం బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలకు మేలు చేయడానికే అన్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల కలెక్షన్స్ దెబ్బతినకూడదని వారసుడు 14కి వాయిదా వేసినట్లు తెలియజేశారు.
దిల్ రాజు నిర్ణయం నిజంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మేలు చేయనుంది. ఓపెనింగ్ డే పెద్ద మొత్తంలో థియేటర్స్ ఆ రెండు చిత్రాలకు లభించనున్నాయి. వారసుడు చిత్రం కోసం దిల్ రాజు లాక్ చేసిన థియేటర్స్ చిరంజీవి, బాలయ్యల చిత్రానికి లభిస్తాయి. వారసుడు వచ్చే వరకు ఆ చిత్రాలు థియేటర్స్ లో ప్రదర్శించుకునే వీలు కలుగుతుంది.

ఇక వారసుడు చిత్రం కోసం యంగ్ హీరో సంతోష్ శోభన్ వెనక్కి తగ్గాడు. ఆయన నటించిన కళ్యాణం కమనీయం మూవీ జనవరి 15కి వాయిదా పడింది. నేటి దిల్ రాజు ప్రకటనతో సంక్రాంతి చిత్రాల విడుదల తేదీల మీద పూర్తి అవగాహన వచ్చింది. జనవరి 11న అజిత్ తెగింపు, 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య, 14న వారసుడు, 15న కళ్యాణం కమనీయం చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.