Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారంటూ వార్తలు రాగా ఆమె స్పందించారు. ఎన్సీబీ అధికారులు తనకు నోటీసులు జారీ చేశారన్న విషయాన్ని ఆమె ఖండించారు. కోలీవుడ్ మీడియాలో రెండు రోజులుగా ఓ వార్త ప్రధానంగా వినిపిస్తుంది. వరలక్ష్మీ పీఏ ఆదిలింగంని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదిలింగంకి అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారట. దీంతో కొచ్చి అధికారులు అతన్ని విచారిస్తున్నారు.
వరలక్ష్మీ పీఏ ఆదిలింగం చీకటి వ్యాపారంతో ఆమెకు కూడా సంబంధాలు ఉన్నాయట. ఆదిలింగం వరలక్ష్మికి కూడా డ్రగ్స్ ఇచ్చాడట. అలాగే ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బులు వరలక్ష్మీ సహాయంతో సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో వరలక్ష్మికి ఎన్సీబీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను వరలక్ష్మీ ఖండించారు.
అసలు ఆదిలింగంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు నా వద్ద పని చేయడం లేదు. ఏడేళ్ల క్రితం కేవలం ఫ్రీలాన్సర్ గా చేశాడు. పర్మినెంట్ గా కూడా చేయలేదు. నా దగ్గర్నుండి వెళ్ళిపోయాక అతనితో నాకు కమ్యూనికేషన్ లేదు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు ఇచ్చారనేది అబద్దం. కథనాలు చూసి నేను షాక్ అయ్యాను. ఒకవేళ నిజంగా నాకు నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతున్నాను. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను… అని అన్నారు.
డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆదిలింగంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని బల్లగుద్ది చెప్పింది. నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురైన వరలక్ష్మీ విలన్ రోల్స్ తో ఫేమస్ అయ్యింది. తెలుగులో ఆమె వరుస చిత్రాలు చేస్తున్నారు. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి వంటి హిట్ చిత్రాల్లో ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు.