‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అభిమానల్లో విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన తొలిరోజే కలెక్షన్ల పర్వం కొనసాగింది. అయితే తెలంగాణలోని థియేటర్లలో దూసుకెళ్తున్న వకీల్ సాబ్ చిత్రం ఏపీలో అనేక అడ్డంకుల మధ్య తెరపై ఆడుతోంది. సినిమా విడుదల అయినప్పటి నుంచి వకీల్ సాబ్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏపీలో పంచాయతీ కోర్టుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే […]

Written By: Srinivas, Updated On : April 12, 2021 2:04 pm
Follow us on


పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అభిమానల్లో విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన తొలిరోజే కలెక్షన్ల పర్వం కొనసాగింది. అయితే తెలంగాణలోని థియేటర్లలో దూసుకెళ్తున్న వకీల్ సాబ్ చిత్రం ఏపీలో అనేక అడ్డంకుల మధ్య తెరపై ఆడుతోంది. సినిమా విడుదల అయినప్పటి నుంచి వకీల్ సాబ్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏపీలో పంచాయతీ కోర్టుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోరాష్ట్రంలో థియేటర్లను మూసివేశారు. దీంతో సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

తెలుగు సినిమాలు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విడుదల అవుతుంటాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి సరిహద్దుగా ఉన్న పర్లాఖెముండి అనే పట్టణంలో ప్రతీ తెలుగు సినిమా విడుదల అవుతూనే ఉంటుంది. దీనికి కారణం.. అక్కడ తెలుగువారు అధిక సంఖ్యలో ఉండడమే. తాజాగా.. వకీల్ సాబ్ సినిమా ‘జైమా’ లక్ష్మీ టాకీసుల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా చూడడానికి జనాలు ఎగబడ్డారు. దీంతో అధికారులు థియేటర్లను మూసివేసినట్లు తెలిసింది.

ఒడిశాలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. దీంతో.. పలు జిల్లాల్లో 50శాతం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్లను నడిపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో ఈ ప్రాంతం కూడా ఉంది. కానీ.. థియేటర్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘించారని, ప్రేక్షకులందరికీ.. టికెట్లు ఇచ్చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.. రెండు థియేటర్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించినట్లు సమాచారం. ఈ రెండు థియేటర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులకు రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం. ఏది ఏమైనా.. సినిమాలపై కరోనా తన ప్రభావాన్ని చూపుతోంది. కోట్లు కుమ్మరించి తీసిన సినిమా కరోనా పాలవుతోందని.. నాలుగు రూపాయలు సంపాదించుకుందామని అనుకుంటే కరోనా తమనోట్లో మట్టి కొడుతోందని థియేటర్ యజమానులు అంటున్నారు.