దేశవ్యాప్తంగా కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడం.. రాష్ట్రంలోనూ కేసులు వేలాదిగా పెరిగిపోతుండడంతో ఇవాళ్టి నుంచి సినిమా థియేటర్లు మూసేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికన్నా ముందుగానే.. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషనే స్వయంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే.. వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ సినిమాకు ఇంకా కొద్దిపాటి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని.. ఈ సినిమా నడిచే టాకీసులను వదిలేసి, మిగిలినవి మూసేయాలని డిసైడ్ చేశారు ఎగ్జిబిటర్లు. అది కూడా.. ఈ వీకెండ్ వరకే అనుకున్నారు. కానీ.. ఇప్పుడు అవి కూడా మూసేస్తామని చెబుతున్నారట ఆయా థియేటర్ల యజమానులు!
నిజానికి.. తెలంగాణలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో.. రాత్రి ఆటలు రద్దయ్యాయి. దీంతో.. మార్నింగ్, మ్యాట్నీలకు అవకాశం ఉంది. అయితే.. ఈ షోలకు కూడా జనాలు వచ్చేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఉన్న ఓ మల్టీ ఫ్లెక్స్ లో నిన్న ఒక షోకు కేవలం 20 మంది మాత్రమే వచ్చారట. మరో మల్టీ ఫ్లెక్స్ లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో షో క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది.
దీంతో.. ఇకమీదట ప్రేక్షకులు వస్తారనే ఆశలేదని థియేటర్ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షో నడిపితే.. కరెంటు బిల్లలు కూడా రావట్లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాంటిది.. ఈ వారాంతం వరకు సినిమా ఆడిస్తే.. నష్టాలే తప్ప, లాభం లేదని అంటున్నారట. అందువల్ల.. తాము కూడా మూసేస్తామని చెబుతున్నారట.
ప్రభుత్వాలు ఆంక్షలు విధించక ముందే.. ప్రజలే దాన్ని అమల్లోకి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో.. థియేటర్ కు రావడానికి భయపడుతున్నారని, దీంతో.. ఆక్యుపెన్సీ 25 శాతానికి పడిపోయి చాలా రోజులైందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 1800 థియేటర్లలో.. 250 నుంచి 300 థియేటర్లకు తప్ప, మిగిలిన వాటికి కంటెంటే లేదని అంటున్నారు. ఈ కారణంతోనే తెలంగాణలో థియేటర్ల నిర్ణయానికి ఎగ్జిబిటర్లే ముందు పడ్డారు.
అయితే.. వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లకు కూడా జనాలు రాకపోవడంతో తాము కూడా బంద్ చేస్తామని చెబుతున్నట్టు సమాచారం. ఈ వీకెండ్ వరకు వాటికి టైమ్ ఇచ్చినప్పటికీ.. అందులో చాలా వరకు నేటి నుంచే మూసేస్తారని తెలుస్తోంది. దిల్ రాజుకు చెందిన థియేటర్లతోపాటు మిగిలిన వాటిలో ఒకటీ రెండు రన్ చేసే అవకాశం మాత్రమే ఉందంటున్నారు. మొత్తానికి.. నాలుగు అడుగులు వెనక్కి వేసిన కరోనా.. ఇండస్ట్రీని చావుదెబ్బ తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.