
ఏపీలో బెనిఫిట్ షోల రద్దు, టికెట్ రేట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదల ముందు రోజు వరకూ సైలెంట్ గా ఉన్న ఏపీ సర్కారు.. ఉన్నఫళంగా సినిమా టిక్కెట్ల విషయం గుర్తుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే సినిమా టిక్కెట్ల ధరలు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జీవో కూడా జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా.. ఎక్కువ ధర నిర్ణయిస్తే థియేటర్లు సీజ్ చేస్తామని ప్రకటించింది.
జగన్ సర్కారు ఉన్నట్టుండి రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. పవన్ అభిమానులతోపాటు ఇతరుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే చేస్తోందని, పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. ఈ విషయమై నాగబాబు స్పందించారు. బెనిఫిట్ షోలు నిలిపేయడం సీఎం జగన్ కు తెలియకపోవచ్చని అన్నారు. పరిపాలనలో తీరికలేకుండా ఉండే ఆయనకు.. ఈ విషయం తెలియకపోవచ్చని, తెలిస్తే తప్పకుండా స్పందించే ఛాన్స్ ఉందన్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదని తాను నమ్ముతున్నానని చెప్పారు.
జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మాత్రమే ఈ పనులు చేసి ఉంటారని అన్నారు నాగబాబు. అయితే.. ఎవరు చేసినా ఇది సరికాదని అన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదుగానీ.. వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు సృష్టించొద్దన్నారు. దానివల్ల సినిమాపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై మంత్రి పేర్ని నాని ట్విటర్ వేదికగా స్పందించారు. చట్ట ప్రకారం రోజుకు నాలుగు షోలకే అనుమతి ఉందని అన్నారు. దురద ఉందని తెల్లవారు జామున వెళ్తే.. షో వేసేది లేదన్నారు. ఈ మాటలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘మీకు ఏమైంది నాని గారూ.. మీరు కరోనా వ్యాక్సిన్ తోపాటు రేబిస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ప్లీజ్ సెండ్ రేబిస్ వ్యాక్సిన్ టూ మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ముందుకొస్తే.. రవాణా ఖర్చులు ఫ్రీ’ అని పోస్టు చేశారు.
మీకు ఏమి అయ్యింది నాని గారు.మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్.please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని.స్టేట్ transposrt మినిస్టర్.వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ. pic.twitter.com/4mkGm7NLeg
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2021
నాగబాబు ‘రేబిస్ వ్యాక్సిన్’ కామెంట్స్ పై మంత్రి పేర్ని నాని కూడా అంతే సెటైరికల్ గా స్పందించారు. నాగబాబు కు కౌంటర్ ఇచ్చారు. ‘‘ముందు మన ఇంట్లో తిరుగుతున్న పవన్ కల్యాణ్ కు వేయించాలని, ఆలస్యమైతే మీక్కూడా అవసరం అవుతుంది’’’ అని ఘాటు కామెంట్ చేశారు పేర్ని నాని. ఈ విధంగా.. వకీల్ సాబ్ పై మొదలైన రాజకీయ రగడ నాగబాబు వర్సెస్ ఏపీ మంత్రి నాని మధ్య కొనసాగుతూనే ఉంది.
పరోపకారి పాపన్న @NagaBabuOffl గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి.ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది.అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు
— Perni Nani (@perni_nani) April 11, 2021