Indian idol 14 winner: చాలామందిలో పాడే నైపుణ్యం ఉంటుంది. కానీ అది బయటపడితేనే సరైన అవకాశాలు లభిస్తాయి. వారి జీవితాలు బాగుపడతాయి. అలాంటి వ్యక్తుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు కొన్ని చానల్స్ పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందులో సోనీ టీవీ ఇండియన్ ఐడల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 14వ సీజన్ గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమైంది. మొత్తం 15 మందితో ఈ షో మొదలైంది. ఐదు నెలలు, 43 ఎపిసోడ్లతో ప్రేక్షకులను రంజింపజేసింది. ఆదివారం ఆరుగురి కంటెస్టెంట్లతో షో నిర్వాహకులు మెగా ఫైనల్ నిర్వహించారు. ఉత్కంఠ గా జరిగిన గ్రాండ్ ఫైనల్ లో కాన్పూర్ ప్రాంతానికి చెందిన వైభవ్ గుప్తా(Vaibhav Gupta) టైటిల్ గెలిచాడు.
ఫైనల్ కు వైభవ్ గుప్తా, శుభదీప్ దాస్, పీయూష్ పవార్, అనన్య పాల్, అంజనా పద్మనాభన్, ఆధ్యామిశ్రా చేరుకున్నారు. వీరి మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగింది. చివరకు న్యాయ నిర్ణయితలు ఇచ్చిన ఫలితం, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు వేసిన ఓట్ల ఆధారంగా నిర్వాహకులు వైభవ్ గుప్తాను విజేతగా ప్రకటించారు. 14 వ సీజన్ కు సంబంధించి ప్రముఖ గాయకురాలు శ్రేయ ఘోషాల్, గాయకుడు కుమార్ సాను, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ న్యాయ నిర్ణయితలుగా వివరించారు. 1990లో అద్భుతమైన పాటలు పాడి ఇండియాను ఒక ఊపు ఊపిన కుమార్ సాను ఈ షోకు నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. హుస్సేన్ ఈ షో కు యాంకర్ గా పనిచేశాడు. గత 9 సీజన్లకు ఆదిత్య నారాయణ్ యాంకర్ గా పని చేశాడు. కానీ ఈసారి అతడిని కాదని హుస్సేన్ కు సోనీ టీవీ యాజమాన్యం అవకాశం కల్పించింది.
విజేతగా నిలిచిన వైభవ్ గుప్తాకు సోనీ టీవీ యాజమాన్యం ప్రైజ్ మనీ కింద 25 లక్షలు అందించింది. ఈ సందర్భంగా ఆ డబ్బులు ఏం చేస్తారని విలేకరులు ప్రశ్నిస్తే..”ఈ డబ్బులు ద్వారా సొంతంగా ఒక స్టూడియో ఏర్పాటు చేసుకోవాలి. నేను పాడే పాటలు రికార్డు చేస్తాను. వాటిని యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. నా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఆ స్టూడియోను ఉపయోగించుకుంటాను. ప్రేక్షకులు నాకు అండగా నిలిచారు. వారిని అలరిస్తూనే ఉంటాను. స్టూడియో ఏర్పాటు చేసుకోవాలనేది నాకు ఎప్పటినుంచో ఉన్న కల. ఇప్పుడు సంపాదించిన ప్రైజ్ మనీతో దానిని సాకారం చేసుకోవాలనుకుంటున్నానని” వైభవ్ గుప్తా ప్రకటించాడు.. కాగా, వైభవ్ గుప్తా తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తన పెద్దమ్మ సమక్షంలో పెరిగాడు. పాటలే లోకంగా బతికాడు. తనలో నైపుణ్యాన్ని పెంచుకొని ఏకంగా ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచాడు. ఫైనల్ లో పీయూష్, శుభదీప్, అనన్య లో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వైభవ్ గుప్తా టైటిల్ దక్కించుకోవడం విశేషం.