Unni Mukundan : గత కొన్నాళ్లుగా మలయాళ సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన చిత్రం మార్కో. ఉన్ని ముకుందన్ మాస్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగులో విడుదల చేస్తే అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో నటించిన ఉన్ని ముకుందన్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. మలయాళంలో రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది సినిమాలో మార్కో ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకుని ఆహా, సోనీ లివ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు హనీఫ్ అడేని డైరెక్ట్ చేయగా.. క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఇప్పటి వరకు చూడని సరికొత్త యాక్షన్ హీరోగా తనను తాను కొత్తగా చూపించుకున్నాడు ఉన్ని ముకుందన్. తెలుగులో కూడా ఈ చిత్రం రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
మలయాళ బాక్సాఫీసు వద్ద 16 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ నటన, యాక్షన్ సీక్వెన్స్ కు ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా ఆయన ‘గెట్ సెట్ బేబీ’ అనే మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మార్కో లాంటి మాస్ యాక్షన్ సినిమా తర్వాత నేడు థియేటర్లలోకి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ల సందర్భంగా తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు ఎందుకు ఉండవనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం అందించారు.
తన సినిమాలను అన్ని వయసుల వారు కలిసి కూర్చొని చూడాలన్నదే తన ఉద్దేశమంటూ చెప్పుకొచ్చారు. ఆ కారణంతోనే దర్శక నిర్మాతలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కొన్ని విషయాలను అంగీకరించనంటూ ఉన్ని ముకుందన్ క్లారిటీ ఇచ్చారు. తను మాట్లాడుతూ.. “సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే నేనొక నిర్ణయం తీసుకున్నాను. కిస్, ఇంటిమేట్ సీన్స్‌లకి దూరంగా ఉండాలని ఓ పాలసీ పెట్టుకున్నాను. అందుకే ఇప్పటివరకూ నటించిన ప్రతి సినిమాలోనూ అదే పాటించాను. అన్ని వయసుల వారు కలిసి కూర్చొని చూసేలా నా సినిమాలు ఉండాలనేది నా నిర్ణయం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను.
కానీ రొమాన్స్, కిస్ సీన్లలో నటించాలని ఎంతోమంది దర్శకనిర్మాతలు నాపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. దీని కోసం వేరే హీరోల సినిమాలను ఉదాహరణగా చెప్పారు. కానీ నా దృష్టిలో ఒక జంట మధ్య రొమాన్స్ చూపించాలంటే ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదు. అలా అని నా తోటి హీరోలు అలాంటి సీన్లలో నటించడాన్ని తప్పుపట్టను. కానీ నేను మాత్రం అలాంటి సీన్లలో నటించను. ఇది నాకు నేను ఓన్ గా పెట్టుకున్న రూల్” అని చెప్పారు. సినిమాల విషయానికి వస్తే ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. జూ. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ కొడుకుగా నటించారు. అలానే అనుష్క నటించిన భాగమతి, సమంత నటించిన యశోద, రవితేజ ఖిలాడి చిత్రాల్లో కూడా నటించారు.