Homeఅప్పటి ముచ్చట్లు'హే.. వాళ్లిద్దరూ ఎవరనుకున్నారు ? అంతే గౌరవించాలి' !

‘హే.. వాళ్లిద్దరూ ఎవరనుకున్నారు ? అంతే గౌరవించాలి’ !

Purnachandra Raoఆ రోజుల్లో ‘నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారు’ అంటే సినీ పరిశ్రమలో ఒక గౌరవం ఉండేది. పైగా ఆయన నిర్మాణంలో తెరకెక్కే చిత్రాల పై అప్పటి ప్రేక్షకులకు బాగా ఆసక్తి ఉండేది. మరి అలాంటి నిర్మాత నుండి ఇద్దరు కొత్త కుర్రాళ్లకు అవకాశాలు వస్తే.. ఇక వారి సంతోషానికి అడ్డు అదుపు ఏమి ఉంటుంది. పైగా వారిలో ఒకరు హీరో, మరొకరు విలన్. దాంతో ఆ కుర్రాళ్ళిద్దరూ ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో తమ గ్రామాల నుండి మద్రాసుకు ప్రయాణమయ్యారు. ఇద్దరు ట్రైన్ దిగగానే వారి కోసం కారు వచ్చింది.

నిర్మాతగారు మన కోసం కారు పంపారు అని ఆ ఇద్దరూ ఎంతో సంతోషించారు. కట్ చేస్తే.. ఫస్ట్ డే షూట్ మొదలైంది. సెట్ లో చాలామంది తమిళవాళ్లే ఉన్నారు. ఈ హీరో, విలన్ ఇద్దరికీ తమిళం ఒక్క ముక్క రాదు. పైగా ఇద్దరూ కొత్తవాళ్లు. ఆ రోజుల్లో అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తవాళ్లు అంటే, చిన్న చులకన ఉండేది. దాంతో సెట్ లో ఉన్న తమిళ వాళ్ళు ఏమయ్యా ఇక్కడికి వచ్చి నుంచో, నువ్వు ముందుకు వెళ్ళు, నీకేనయ్యా నువ్వు వెనక్కి పో’ అంటూ హేళన చేస్తూ వాళ్లలో వాళ్లు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఆనందిస్తున్నారు.

పాపం ఇదంతా ఆ హీరోగారికి, ఆ విలన్ గారికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, ఏం చేస్తారు ? ఛాన్స్ కావాలి, అందుకే ఆ అవమానాలను వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారికి ఇలాంటివి అసలు సహించరు. వీరిని అవమానించడం ఆయన కంటపడింది. కట్ చేస్తే.. మీటింగ్, అందరూ మీటింగ్‌ కి హాజరయ్యారు. వారందరి వైపు పూర్ణచంద్రరావుగారు సీరియస్‌ గా చూస్తూ.. ‘మనం మన సినిమాల్లోని ఆర్టిస్ట్‌ లను గౌరవించాలి. వాళ్లిద్దరూ ఎవరనుకున్నారు ? వాళ్లకు నటరాజు మీద భక్తి, నటన మీద ఆపేక్ష ఉంది’ అని మొదలుపెట్టి అందర్నీ తిట్టిన తిట్టు తిట్టకుండా వాయించి వదిలిపెట్టారు.

చివర్లో అందరికీ వార్నింగ్ ఇస్తూ.. ‘మీ ప్రవర్తన మరోసారి పెచ్చుమీరిపోతే పుచ్చెలు పగులుతాయి, బీ కేర్‌ఫుల్‌. మన సెట్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటే ఎంత గౌరవిస్తామో రేపటి నుండి వీళ్లిద్దరినీ మీరు అంతే గౌరవించాలి. ఆ దెబ్బకు అక్కడున్న అందరూ తెల్లముఖాలు వేసుకుని ‘అలాగే సర్’ అంటూ ఆ ఇద్దరి వైపు క్షమించమన్నట్టు చూశారు. ఆ ఇద్దరూ అలాగే అంటూ చిరు నవ్వు నవ్వి పర్వాలేదు అంటూ భరోసా ఇచ్చారు. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు అంటే.. హీరో వచ్చేసి మురళీమోహన్, విలన్ వచ్చేసి గిరిబాబు. వీరిద్దరి మొదటి సినిమా సమయంలో ఈ సంఘటనలు జరిగాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version