Prabhas: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ హడావిడి నడుస్తుంది. ప్రతి నెల రెండు మూడు సినిమాలు రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. స్టార్ హీరో పుట్టినరోజు కు ఆ హీరో కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాకు 4k లోకి మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ అవుతున్న సినిమాలు ఊహించని స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తున్నాయి. దీంతో రీ రిలీజ్ లు హడావిడి ఎక్కువగా ఉన్నాయి.
పాన్ ఇండియా స్థాయి నుండి పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్న ప్రభాస్ నటించిన మరో సినిమాను రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బిల్లా, వర్షం మూవీస్ ను రీ రిలీజ్ చేశారు వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని మరో సినిమాను సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా హిట్ అయిన లేదా మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు రీ రిలీజ్ చేస్తారు. కానీ ప్రభాస్ కెరీర్ లో ప్లాప్ గా మిగిలిపోయిన “యోగి” సినిమాను రీ రిలీజ్ చేయడం విశేషం.
వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2007 జనవరి 10 న విడుదల అయ్యింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదు. 20 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా కేవలం 13 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది. ఆ తర్వాత మలయాళం, హిందీ లో రిలీజ్ చేసిన కానీ అక్కడ కూడా ఇదే రిజల్ట్ వచ్చింది. కన్నడ లో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ‘జోగి’ సినిమా రీమేక్ యోగి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నయనతార కథానాయికగా నటించింది. కోట శ్రీనివాస రావు, అల్లి, సుబ్బు రాజ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పెద్దగా ఆకట్టుకొని సినిమాను ఆగస్టు 18 న మళ్ళీ రీ రిలీజ్ చేయడం అనేది సాహసమే అని చెప్పాలి. కాకపోతే ప్రభాస్ కి ఉన్న స్టార్డం ను దృష్టిలో పెట్టుకొని దీన్ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రింట్ ఖర్చులు, రిలీజ్ ఖర్చులు పోను మూడు నాలుగు కోట్లు రావచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ వచ్చే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది .