TV To silver screen stars సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఆ జర్నీ. మహర్షి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ఇది. ఇది చాలు అని రిలాక్స్ అయితే మానవజాతి ఇంత అభివృద్ధి, సాంకేతికత చూసేది కాదు. ఇంకా ఏదో సాధించించాలి, మరింత మెరుగైన స్థితికి వెళ్లాలనే తపన సృష్టిలో మానవజాతిని ప్రత్యేకంగా నిలిపింది. దీనికి ఉదాహరణగా కొందరు స్టార్స్ నిలిచారు. బుల్లితెర ద్వారా తమ ప్రయాణం మొదలుపెట్టి సిల్వర్ స్క్రీన్ ని ఏలే తారలుగా ఎదిగారు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కెజిఎఫ్ స్టార్ యష్ తెలియని సినిమా ప్రేమికుడు బహుశా దేశంలోనే ఉండడేమో. అతిపెద్ద పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన యష్ కెరీర్ మొదలైంది సీరియల్ నటుడిగా. నటనపై ఆసక్తితో యష్ టీనేజ్ లోనే ఇంటి నుండి పారిపోయాడు. థియేటర్ ఆర్టిస్ట్ గా నటనలో శిక్షణ సాధించి సీరియల్స్ లో అవకాశాలు అందుకున్నాడు. యష్ నటించిన ‘నంద గోకుల’ సీరియల్ సక్సెస్ కాగా… సినిమా ఆఫర్స్ ఆయన తలుపు తట్టాయి.
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున నయనతార పేరు చెబుతారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న నయనతార కెరీర్ బిగినింగ్ లో టెలివిజన్ ప్రెజెంటర్ గా చేశారు. ఆమె పలు ఉత్పత్తులు, లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రోగ్రాం లో ప్రజెంటర్ గా పని చేశారు. 2003లో ఒక మలయాళ మూవీతో నటిగా మారారు.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్. డాన్స్ రియాలిటీ షోస్ లో కంటెస్టెంట్ గా ఆమె ప్రస్థానం మొదలైంది. ఢీ సీజన్ 4 లో ఆమె పాల్గొన్నారు. నటనపై మక్కువతో పరిశ్రమకు వెళ్లి హీరోయిన్ అయ్యారు. హీరోయిన్ గా సాయి పల్లవి మొదటి చిత్రం ప్రేమమ్ సూపర్ హిట్ కాగా… ఆమెకు మంచి పేరొచ్చింది.
స్టార్ కిడ్ కీర్తి సురేష్ కెరీర్ బాలనటిగా మొదలైంది. కీర్తి సురేష్ తల్లి మేనక హీరోయిన్, తండ్రి సురేష్ దర్శకుడు. వారికి ఉన్న పరిచయాలతో కీర్తిని సీరియల్స్ లో బాలనటిగా ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు.
అంటే సుందరానికీ హీరోయిన్ నజ్రియా గొప్ప వ్యాఖ్యాత. ఆమె టీనేజ్ లోనే మలయాళ ఛానల్ లో క్విజ్ షోకి యాంకర్ గా వ్యవహరించారు. తర్వాత నటిగా మారారు. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ని నజ్రియా ప్రేమ వివాహం చేసుకున్నారు.
సీతారామం మూవీ ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక సంచలనం. ఆ మూవీలో సీతగా చేసిన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేశారు. మృణాల్ కెరీర్ కూడా బుల్లితెరపైనే మొదలైంది. 2012 లో మృణాల్ సీరియల్ నటిగా ప్రస్థానం మొదలుపెట్టారు. కుంకుమ్ భాగ్య సీరియల్ సూపర్ సక్సెస్ కావడంతో ఆమెకు ఫేమ్ వచ్చింది. అలా సినిమా హీరోయిన్ కావడానికి మార్గం ఏర్పడింది.