
కరోనా మహమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా నష్టపోయింది. థియేటర్లు మూత పడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల విడుదల నిలిచిపోయింది. సినిమాలే కాదు సీరియల్స్ రంగం కూడా చాలా దెబ్బతిన్నది. దాదాపు మూడు నెలలు షూటింగ్స్ లేకపోవడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఈ మధ్యమే షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి. లాక్‌డౌన్ రూల్స్ పాటిస్తూ, అనేక జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. దాంతో, అనేక మంది నటులతో పాటు కార్మికులకు పని దొరికింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ ప్రమాదం తప్పడం లేదు. ఇప్పటికే పలువురు సీరియల్ ఆర్టిస్టులకు వైరస్ సోకడం పరిశ్రమలో అలజడి రేపింది. సీనియర్ నటుడు ప్రభాకర్, ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చినా అవి పుకార్లే అని తేలాయి. కానీ, తాజా ఓ ప్రముఖ నటికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తున్నది. మా టీవీ ‘ఆమె కథ’ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?
మూడు, నాలుగు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడిన ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. దాంతో, ఆమె క్వారంటైన్‌లో ఉంది.ఈ విషయాన్ని నవ్యనే స్వయంగా వెల్లడించింది. కరోనా అని తేలినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నానని, తనను చూసి తల్లి కూడా కన్నీటి పర్యంతమైందని చెప్పింది. విషయం తెలిసి చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, కరోనా లక్షణాలు, చికిత్సకు సంబంధించిన మెసేజ్‌లతో తన వాట్సప్ నిండిపోయిందని తెలిపింది. తన సహనటులు, ఇతర సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు చాలా బాధపడుతునని చెప్పింది. అయినా గుండె నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని, కరోనా వచ్చిన వారంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నది. కాగా నవ్యతో కలిసి షూటింగ్స్‌లో పాల్గొన ఇతర నటీనటులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఏదేమైనా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో షూటింగ్స్ జరపడం ప్రమాదం కొనితెచ్చుకోవడమే అనిపిస్తోంది.