త్రివిక్రమ్ సినిమాల పై సోషల్ మీడియాలో నిత్యం ఓ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చల్లో భాగంగా వచ్చిన అంశం. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరోల చంకల్లో బ్యాగులుంటాయి. ఇది ఆనవాయితీ. అందుకే, త్రివిక్రమ్ సినిమాల పై ఒక పంచ్ వేయాలనిపిస్తోంది. త్రివిక్రమ్ అంటే పంచ్ లు వేయడాలే కాదు, హీరోలు సంచులు మోయడాలు కూడా మామూలే. దీనికి తోడు త్రివిక్రమ్ సినిమాలన్నీ ఒకేలా ఉండటం మరో బాగోతం. ఏది ఏదైనా ఒక పాత సినిమాలోని కథ నుంచి మరో కొత్త చిత్రాన్ని పుట్టించడంలో ఆ కథలో ఒక బ్యాగ్ ను పెట్టడంలో త్రివిక్రమ్ మేటి అనుకోవచ్చు.
అతడు సినిమాలో హీరో పల్లెటూరికి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో హీరోగారు బ్యాగును ఎత్తుకుని దిగుతాడు. అలాగే జల్సా సినిమాలో హీరో నక్సలైట్. జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అంటే హీరో ఒక చోట నుంచి మరో చోటుకు మారతాడు. ఈ క్రమంలో హీరోగారు బ్యాగు ఎత్తుకుని దిగుతాడు. ఖలేజా సినిమాలో హీరో ట్యాక్సీ డ్రైవర్. ఓ పనిమీద రాజస్థాన్ వెళ్తాడు. ఈ క్రమంలో హీరోగారు బ్యాగును ఎత్తుకుని దిగుతాడు.
అత్తారింటికి దారేది సినిమాలో కోటేశ్వరుడైన హీరో అత్తను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చేస్తాడు అలా హీరోవారు ఓ చోటు నుంచి మరో చోటుకు మారతాడు. ఇది హీరో బంధువుల దృష్టిలో అజ్ఞాతవాసం, హీరో దృష్టిలో వనవాసం. అంటే ఈ సినిమాలో హీరో గారు ఏంటి..? ఏముంది ఇక్కడ కూడా బ్యాగును ఎత్తుకోవడమే.
‘అ.ఆ..’ సినిమా. హైదరాబాదులో ఉండే హీరోయిన్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని అత్తారింటికి వస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ గారు ఏమి చేస్తోంది ? బ్యాగు ఎత్తుకుని దిగుతుంది. జులాయి సినిమాలో హీరో వారు విశాఖపట్టణంలో ఉంటారు. అనుకోకుండా హైదరాబాదుకు మకాం మారాల్సి వస్తోంది. అంటే ఇక్కడా హీరోగారు బ్యాగును ఎత్తుకుని బయలుదేరతాడు.
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా మరీ విచిత్రం. పాపం ఈ చిత్రంలో హీరోగారికి రెండు స్థానచలనాలు చేయాల్సి వస్తోంది. ఇక ఏం చేస్తాడు. రెండుసార్లు ఈ క్రమంలో హీరోగారు బ్యాగును ఎత్తుకుని దిగుతాడు. అరవిందసమేత వీర రాఘవ. ఈ సినిమాలోనూ అంతే హీరో గారు ఎంట్రీనే విదేశాల నుంచి బ్యాగును దిగుతాడు. మళ్ళీ అదే బ్యాగుతో చలో హైదరాబాద్ అంటాడు. ఇక అలవైకుంఠపురములో ఇదే వ్యవహారం లేండి.
