Mazaka Movie : యంగ్ హీరో సందీప్ కిషన్, బ్యూటీ క్వీన్ రీతూ వర్మ నటించిన ‘మజాకా’ చిత్రం రేపు అంటే ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ చిత్రంలో మన్మథుడు ఫేం అన్షు, రావు రమేష్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కించిన సినిమా ఇది. ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా త్రినాథ్ రావు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, హీరోయిన్ అన్షుపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇటీవల, దీని గురించి మళ్ళీ ప్రశ్నించగా ఆయన మరో సారి వివరణ ఇచ్చారు. ఈ వివాదం వల్ల తన తల్లి చాలా బాధపడిందని డైరెక్టర్ త్రినాథరావు అన్నారు.
“ఆ రోజు నేను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు. అక్కడున్న వారిని నవ్వించడానికి నేను ఏదో అన్నాను. అది అనుకోకుండా జరిగింది. కానీ నేను అనుకోకుండా చెప్పినా, నేను చేసింది తప్పుగానే భావిస్తున్నాను. వేదికపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందని నేను చాలా బాధపడ్డాను. అందుకే నేను అందరికీ క్షమాపణలు చెప్పాను. అన్షుకి ఏమి జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆమె నాకు ఫోన్ చేసి ఏమి జరిగిందని అడిగింది. దానితో, నేను ఆమెకు మొత్తం విషయం వివరించాను. ఆమె అర్థం చేసుకుంది.
అయితే, ఈ వివాదం జరిగినప్పుడు, నాకంటే మా అమ్మే ఎక్కువగా బాధపడింది. దర్శకుడిగా మంచి పేరు సంపాదించడానికి మీరు ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డావు. కానీ ఈ రోజు ఈ ఒక్క మాట నోరు ఎందుకు జారావు నాన్న? అందరూ మీ గురించి ఎంత చెడుగా మాట్లాడుతున్నారో చూశావా. ఒక్క మాట నిన్ను చెడ్డవాడిని చేసింది. నేను ఇంటింటికీ వెళ్లి నువ్వు అలాంటివాడివి కాదని అందరికీ చెప్పలేను. ఇప్పటి నుండి, వేదికపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు.. అంటూ మా అమ్మ మరీ మరీ చెప్పింది. ఈ కారణంగా ఆమె దాదాపు వారం రోజులు బాధపడింది. ఆమెను చూసి నేను ఇంకా టెన్షన్ పడ్డాను. అందుకే భవిష్యత్తులో నేను ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నాను” అని త్రినాధరావు అన్నారు.
మజాకా టీజర్ లాంచ్ కార్యక్రమంలో త్రినాధరావు అన్షు శరీరాకృతి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. త్రినాధరావు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ అన్షు కూడా తెలియకుండా మాట్లాడారని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అన్షుని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ కావాలని చేయలేదని.. దాని వెనుక తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని త్రినాథరావు వివరణ ఇచ్చాడు. మజాకా మూవీ శివరాత్రి సందర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ పై వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.