
కొంతకాలంగా బాలీవుడ్లో బయోగ్రఫీ.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్.. సైన్స్ ఫిక్షన్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఈ కథాంశాలతో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాపులో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు కాసులవర్షం కురిపించాయి.
తాజాగా మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు ‘తుఫాన్’ మూవీ రాబోతుంది. కరోనా నేపథ్యంలో ‘తుఫాను’ మూవీని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. జూలై 16న ‘తుఫాను’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ఈనేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మోహ్రా ‘తుఫాను’ మూవీకి అద్భుతంగా తెరకెక్కించినట్లు కన్పిస్తుంది. ఫర్ఫాన్ అక్తర్ బాక్సర్ గా కన్పించబోతుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ను పరిశీలిస్తే.. ‘తుఫాను’ మూవీ ఓ స్ట్రీట్ ఫైటర్ కథగా అర్థమవుతోంది. ఓ అమ్మాయి ప్రేమపడిన వీధి రౌడీ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎలా ఎదిగాడు అనేది సినిమాగా చూపించినట్లు తెలుస్తోంది.
ఫర్హాన్ అక్తర్ జాతీయ బాక్సర్ గా ఎదిగే క్రమంలో అతడు చేసిన ఓ తప్పు కారణంగా ఐదేళ్లు నిషేధానికి గురవుతాడు. తన ప్రేయసి తనను బాక్సర్ గా మళ్లీ చూడాలని కోరుతుంది. ఈక్రమంలో వీరిమధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనేది ట్రైలర్లో భావోద్వేగంతో చూపించారు. బాక్సింగ్ కోచ్ గా పరేష్ రావల్ నటించాడు.
‘తుఫాను’ మూవీ కోసం ఫర్హాన్ అక్తర్ భారీగా కసరత్తులు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీకి శంకర్-ఎహ్సాన్-లాయ్ మ్యూజిక్ అందించారు. జై పినక్ ఓజా సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా మేఘ్నా మనిచందన్ సేన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. స్క్రీన్ ప్లేను అంజూమ్ రాజాబలి అందించారు.