Tollywood Senior Heroes
Tollywood Senior Heroes: తమిళవారు నేటివిటీకి దగ్గరగా సినిమాలు తీస్తారు అని ఎప్పటినుంచో వారికి మంచి పేరు ఉంది. అలా అని మన తెలుగువారు గొప్ప సినిమాలు తీయలేరని కాదు. సౌత్ ఇండియన్ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది మన తెలుగు సినిమాలే. కానీ ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది సీనియర్ తెలుగు హీరోలు మాత్రం ఇంకా మూస దోరాన కథలు ఎంచుకుంటూ, తమకు వయసు కాకుండా పసివారిమే అని తెలుపడానికి ఓవర్ గా మేకప్ వేసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకున్నారు.
మన పక్క రాష్ట్రం తమిళవారు హీరోలు మాత్రం అందంకి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాకు తగ్గట్టుగా తయారు అవ్వడం తెలుగు ప్రేక్షకులను సీనియర్ తెలుగు హీరోలపై మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. అక్కడ అజిత్, రజినీకాంత్ లాంటి వారు ఎప్పుడూ కూడా తమ వయసు కనిపించకుండా ఉండాలని ప్రయత్నించరు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకప్ అయినా వేసుకుంటారు. కానీ అది మన తెలుగు హీరోల్లో కనిపివ్వదు.
సినిమా కథను బట్టి నెరసిన జుట్టు.. తాత క్యారెక్టర్.. కళ్లద్దాలు.. ఇలా వేటికైనా సిద్ధంగా ఉంటారు తమిళ హీరోలు. ముఖ్యంగా ఇవన్నీ ఈమధ్య రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో మనం చూడొచ్చు. ఒక అనవసరమైన పాట లేదు. ఒక హీరోయిన్ లేదు.. అయినా రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఈ సినిమా ఒప్పుకొని సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఇది మన తెలుగులో సాధ్యమా. మన మెగాస్టార్లు ..సూపర్ స్టార్లు .. ఇలా ఒప్పుకుంటారా. మన స్టార్లు ఎలాంటి వాళ్లంటే ఇలాంటి సినిమాలు తీస్తే కూడా అందులో ఒక ఐదు ఐటమ్ సాంగ్స్ పెట్టేస్తారు. ఏదో ఒక పాటలో యంగ్ గా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అందరూ తెలుగు హీరోలు అని చెప్పలేము కానీ చాలామంది తెలుగు హీరోలు మాత్రం ఇలానే తయారవుతున్నారు.
ఆరు పదుల వయసు దాటినా కానీ ఇంకా కుర్ర హీరోయిన్లు వేసుకొని, తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్ పెట్టుకుంటూ.. మామూలు కథకి కూడా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గెటప్ వేసుకొని తాము ఇంకా కుర్ర హీరోలే అన్నట్టు కవరింగ్ ఇస్తున్నారు. వరసగా సినిమాలు ఫ్లాప్ అయినా వారు మారడం లేదు.
కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకోవడం దానికి పైగా అందంగా కనిపించడానికి మరింత డబ్బులు ఖర్చు పెట్టి ఎఫెక్ట్స్ పెట్టడం. పోనీ దానికి తగ్గట్టు సినిమా ఉంటుందా అంటే అది లేదు. రొటీన్ రొట్ట సినిమాలు తీస్తూనే వుంటారు తప్ప, కొత్తగా ప్రయత్నం అన్నది చేయరు. ఇది కవరింగ్ చేసుకోడానికి ఆడియో రిలీజ్ లో ఈవెంట్ లో మళ్ళీ ‘అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలానే కనిపిస్తాను’ అంటూ ప్రతి హీరో చెబుతూ ఉంటారు.
ఈ ఓటీటీ తరుణంలో కూడా, అలానే మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమయంలో కూడా, చాలామంది మన తెలుగు హీరోలు మారేతట్టు కనిపించడం లేదు. నిర్మాతలకు నష్టం ..టాలీవుడ్ ప్రేక్షకులకి కష్టం కలిగిస్తున్నారు ఈ హీరోలు.. వీళ్ళు ఇంక ఎప్పటికీ మారుతారో దేవుడికే తెలియాలి.