Big Stars: టాలీవుడ్ కు మునుపటి రోజులు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కరోనాతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన ఇండస్ట్రీ మెల్లిగా కోలుకుంటోంది. ఇప్పటికే రిలీజుకు రెడీగా ఉన్న పెద్ద సినిమాలన్నీ థియేటర్లలో దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల రిలీజైన ‘అఖండ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పెద్ద సినిమాలన్నీ ఏ బెరుకు లేకుండా విడుదలకు ముస్తాబవుతోన్నాయి.

క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు పెద్ద సినిమాల హడావుడి కన్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు రిలీజు డేట్స్ ను ప్రకటించాయి. ‘అఖండ’ తర్వాత ‘పుష్ప’ రానుంది. కొత్త ఏడాదిలో రాధేశ్యామ్.. భీమ్లానాయక్.. ఆర్ఆర్ఆర్.. ఆచార్య వంటి బిగ్ మూవీస్ రాబోతున్నారు. దీంతో ఏ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధిస్తుందనే టాక్ టాలీవుడ్లో నడుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలు ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ విడుదల చేసి సినిమాలపై దర్శక, నిర్మాతలు హైప్ పెంచుతున్నారు. ఏదిఏమైనా కంటెంట్ ఉంటే ప్రేక్షకులను సినిమాలను ఆదరిస్తాడు. దీంతో సినిమా విడుదలకు ముందు రిలీజయ్యే ట్రైలర్ తో అంచనాలను పెంచేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం నిర్మాతలు చేస్తున్నారు.
ఈక్రమంలోనే పెద్ద సినిమాలకు సంబంధించి ట్రైలర్స్ డేట్స్ సైతం తాజాగా ఫిక్స్ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి కానుకగా రానుంది. ఈనేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ 9వ తేదిన రాబోతుంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ కోసం సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. అలాగే పుష్ప మూవీ ట్రైలర్ 6వ తేదిన రాబోతుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీపై అల్లు ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.
డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్దే నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 17న రానుందని సమాచారం. అదేవిధంగా పవన్ కల్యాణ్ ‘బీమ్లానాయక్’ మూవీ జనవరి 13న థియేటర్లలో రిలీజు కానుంది. దీంతో ట్రైలర్ జనవరి 1 లేదా 5వ తేదిన రిలీజు చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.
ఆచార్య మూవీ ఫిబ్రవరి 4న రిలీజఉ కానుంది. దీంతో ఈ మూవీ ట్రైలర్ సైతం జనవరిలోనే వచ్చే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి పెద్ద సినిమాలన్నీ క్రిస్మస్, సంక్రాంతి సెలవులను టార్గెట్ చేస్తున్నాయి. అన్ని కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కిన మూవీలే కావడంతో అభిమానులు సైతం ఈ సినిమాల కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.