Pawan Kalyan: వైకాపా గ్రామ సింహాల ఘోంకారాలు ఎలా సహజమో, మన జనసైనికుల సింహ గర్జనలు అంతే సహజం, అయినా కోడికత్తి, కిరాయి మూకలకు మనం భయపడతామా ? భయపడే ప్రశ్నేలేదంటూ పవన్ ఆవేశంగా చెప్పారు. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఓ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా పార్టీ నేతలతో పవన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ స్పీచ్ ఆవేశంగా సాగింది. ‘భయం అంటే ఎలా ఉంటుందో నేను మీకు బాగా నేర్పిస్తాను. గుర్తు పెట్టుకోండి కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి మరీ కొడతాను. అయినా ఆలోచించండి. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయడం లేదు ?
అసలు కోడికత్తి కేసు ఏమైంది ? ఈ విషయం గురించి అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, నేను బాపట్లలో పుట్టినోడిని, నాకు తిట్లు రాక కాదు, నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. ఇక గతంలో వైకాపా అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడిన మాటలు మర్చిపోయారా ?
నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు. అందుకే, వాళ్ళు ఎంతలా మొరిగినా నేను వైకాపా వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు ఇచ్చారు. అందుకే, మళ్ళీ చెబుతున్నాను. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడను అని హామీ ఇస్తున్నాను’ అంటూ పవన్ తెలియజేశారు.
అలాగే పవన్ టికెట్ల గురించి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా థియేటర్లు లేవు. మీ వైకాపా నేతలకే థియేటర్లు ఉన్నాయి. మరి నేను ఎందుకు సినిమా టికెట్ల గురించి మాట్లాడానో.. సినిమా ఇండస్ట్రీ బాగు కోసం. అయినా మా కష్టార్జితంపై ప్రభుత్వం పెత్తనం ఏమిటని మాత్రమే నేను అడిగాను. దానికి సమాధానం చెప్పకుండా కాట్ల కుక్కల్లా వైకాపా వాళ్లు అరుస్తున్నారు’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు.