Kat Raj Alias Supreeth Assault Case: అనేక సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు సుప్రీత్. ఈయన్ని ‘ఛత్రపతి’ సినిమాలో కాట్ రాజ్ గా మనం గుర్తు పట్టొచ్చు . ఇందులో ఆయన ప్రభాస్ తో ఏ రేంజ్ లో తలపడుతాడో మనమంతా చూశాము. అలా ఆయన దాదాపుగా అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. అయితే ఆయన కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితం లో కూడా విలన్ లాగానే వ్యవహరిస్తున్నాడని రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా నిల్చింది. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈయన ఆదివారం రోజున శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ని చితకబాదినట్టు తెలుస్తోంది. ఈమేరకు నేడు ఉదయం సుప్రీత్ పై కీసర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం రాత్రి తన ట్రిప్ ని పూర్తి చేసుకొని నాగారం చౌరస్తా లో ఒక రోడ్డు సైడ్ కారు ని పార్క్ చేశాడు. అదే సమయం లో సుప్రీత్ తన కారులో అటువైపుగా వచ్చాడు, శ్రీహరి దగ్గరకు వెళ్లి , నా కారు కి అడ్డంగా పెట్టావు అంటూ కోపం తో ఊగిపోయి , పూర్తిగా విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడ్డాడు అని బాధితుడు కంప్లైంట్ లో పేర్కొన్నాడు. దీంతో శ్రీహరి తక్షణమే పోలీసులకు ఫోన్ చేయడం , వాళ్ళు వెంటనే ఘటన స్థలం వద్దకు వచ్చి పరిస్థితి ని సద్దుమణిగేలా చేయడం చేశారట. బాధితుడు శ్రీహరి ఇచ్చిన కంప్లైంట్ మేరకు నేడు నటుడు సుప్రీత్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
మరోపక్క సుప్రీత్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. సుప్రీత్ కి సెలబ్రిటీ అనే అహంకారం ఎక్కువ అవ్వడం వల్లే , ఇలా ప్రవర్తించాడని అంటున్నారు. అయితే ఇన్ని రోజులు సుప్రీత్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు , ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే సుప్రీత్ మీడియా కి చాలా దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి గురించి నేడు ఇలాంటి వార్త వచ్చిందంటే , అక్కడ ఏమి జరిగిందో పూర్తి సమాచారం తెలుసుకోకుండా, నిందించడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజెన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే సుప్రీత్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయనకు సినిమాల్లో డిమాండ్ ఇసుమంత కూడా తగ్గకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆయన తెలుగు లో ‘ది రాజాసాబ్ ‘, ‘గాయపడిన సింహం’ వంటి చిత్రాల్లో నటించగా , తమిళం లో ‘కరుప్పు’ అనే చిత్రంలో నటించాడు.
