Chinmayi Sripaada: నయనతార-విగ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వివాహం జరిగిన నాలుగు నెలల్లో తాము తల్లిదండ్రులమయ్యామని ప్రకటించడం వివాదాస్పదమైంది. నయనతార దంపతులు సరోగసి నిబంధనలు ఉల్లగించారంటూ తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణ చేపట్టాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఆదేశించడం జరిగింది. అయితే నయనతార దంపతులు తమకు ఆరేళ్ళ క్రితమే వివాహమైనట్లు వివరణ ఇచ్చారు. తమకు రిజిస్టర్ మ్యారేజ్ జరిగినట్లు ఆధారాలు సమర్పించారట. అలాగే నయనతార-విగ్నేష్ పిల్లలను గర్భంలో మోసిన మహిళ కూడా బంధువే అంటూ తెలియజేశారట.

సరోగసీ నిబంధనలు మేము ఉల్లగించలేదని నయనతార-విగ్నేష్ ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతుంది. నయనతార ఇచ్చిన సమాచారం నిజమేనా అనే కోణంలో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. నయనతార సరోగసి వివాదం సద్దుమణగక ముందే మరో సెలబ్రిటీ ఈ సరోగసీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద సైతం సరోగసీ పద్దతిలో పిల్లల్ని కన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్మయి సైతం గర్భంతో కనిపించకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. దీంతో నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. చిన్మయి సంతానం కోసం సరోగసీని ఆశ్రయించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమె స్పందించారు. నేను సహజంగానే పిల్లల్ని కన్నాను. అయితే నా ప్రెగ్నెన్సీ ఫోటోలు నేను బయటపెట్టలేదు. గర్భంతో నా వృతి నేను కొనసాగించాను. అయితే ఎవరూ ఫోటోలు తీయవద్దని వేడుకున్నాను.

కారణం మొదటిసారి గర్భం దాల్చినప్పుడు గర్భస్రావం అయ్యింది. దాంతో నేను రెండోసారి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అలాగే తాను నిండు గర్భంతో ఉన్న ఫోటో షేర్ చేశారు. అదే సమయంలో ఏ విధంగా తల్లైనా తప్పులేదు. మనిషైనా జంతువైనా తల్లి తల్లే. అని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే తన ఇద్దరు కవల పిల్లలకు ఒకేసారి పాలు ఇస్తున్న ఫోటోను చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు.