https://oktelugu.com/

Chandini Chowdary: చాందిని చౌదరి మాటలు.. సన్ రైజర్స్ అభిమానుల మంటలు.. ఇప్పట్లో ఈ వివాదం సర్దుమణుగుతుందా?

చాందిని చౌదరి తెలుసు కదా.. పలు చిత్రాల్లో నటించింది. మెరిట్ ఉన్న నటే. కాకపోతే మన తెలుగు చిత్ర పరిశ్రమలో.. తెలుగు హీరోయిన్లకు ఏ పాటి గౌరవం దక్కుతుందో తెలిసిందే కదా. ఇక చాందిని చౌదరి ప్రస్తుతం మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓ సినిమాలో నటిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 30, 2024 / 07:52 AM IST

    Chandini Chowdary

    Follow us on

    Chandini Chowdary: మన సమాజంలో కొంతమంది సెలబ్రిటీ హోదాను మోస్తుంటారు. అనివార్యంగా ప్రజలు వారికి ఆ హోదాను కట్టబెడుతుంటారు. తమకున్న ఎక్స్ ట్రా మెరిట్ ద్వారా కొంతమంది సెలబ్రిటీలు అవుతుంటారు. అలాంటివారికి ఈ సమాజం ఇచ్చే రెస్పెక్ట్ వేరే విధంగా ఉంటుంది. అలాంటి రెస్పెక్ట్ ను వారు కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే క్రమంలో ఏ మాత్రం మాట తడబడినా తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మాటలు తడబడి చాలామంది సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారు. చేసిన తప్పు తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఈ జాబితాలో మరో నటి చేరింది.

    చాందిని చౌదరి తెలుసు కదా.. పలు చిత్రాల్లో నటించింది. మెరిట్ ఉన్న నటే. కాకపోతే మన తెలుగు చిత్ర పరిశ్రమలో.. తెలుగు హీరోయిన్లకు ఏ పాటి గౌరవం దక్కుతుందో తెలిసిందే కదా. ఇక చాందిని చౌదరి ప్రస్తుతం మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. అందులో ఐపీఎల్ కు సంబంధించిన ప్రశ్నను ఓ విలేఖరి అడిగారు. ” మీరు క్రికెట్ చూస్తారా? ప్రస్తుత ఐపిఎల్ లో మీ ఫేవరెట్ జట్టు ఏది?”అని అడిగితే..”నేను ఇంతవరకూ క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడలేదు. ఒక్కసారైనా స్టేడియం వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూడాలని ఉంది. నాకైతే ఇప్పటివరకు ఫేవరెట్ జట్లు అంటూ ఏవీ లేవు. నాది సొంత ప్రాంతం ఆంధ్ర కాబట్టి.. ఆంధ్రకు ఇంతవరకు సొంత జట్టు అంటూ లేదు. కాబట్టి ఐపీఎల్లో ఆంధ్ర పేరు మీద జట్టు ఏర్పడితే అప్పుడు ఆలోచిస్తానని” చాందిని చౌదరి సమాధానంగా చెప్పింది. ఇక అంతే.. అప్పుడు మొదలైంది సోషల్ మీడియాలో ఆమెపై దాడి.

    హైదరాబాద్ జట్టు లో తెలుగు వాళ్ళు ఉన్నారని, ఆ జట్టు తెలుగు రాష్ట్రానికి కాదా, ఇందులో ప్రాంతేతర వ్యాఖ్యలు ఎందుకు అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ప్రశ్నిస్తూ చాందిని చౌదరిని ఒక ఆట ఆడుకుంటున్నారు. “ఒక సెలబ్రిటీ అయి ఉండి అలా ఎలా అంటారని, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు తెలుగు రాష్ట్రాలది కదా! ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. “హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేయకుండా పర్వాలేదని, కానీ, ప్రాంతీయ అభిమానం పెట్టుకుని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని” వారు ప్రశ్నిస్తున్నారు. “సెలబ్రిటీ అయి ఉన్నప్పుడు కాస్త చూసుకొని మాట్లాడాలని” హితవు పలికారు. అయితే హైదరాబాద్ అభిమానుల ట్రోలింగ్ ఓ రేంజ్ లో ఉండగా.. దానికి ఇంతవరకు చాందినీ చౌదరి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మరి ఈ వివాదం వల్ల తమ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని మ్యూజిక్ షాప్ మూర్తి యూనిట్ భయపడుతోంది.