12th Fail: చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిత్ సొంతం చేసుకుంది 12th ఫెయిల్ సినిమా. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు సాధించింది. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది.
ఒకే థియేటర్‌లో..
12th ఫెయిల్ సినిమా 25 వారాలుగా ఒకే థియేటర్‌లో విజయవంతంగా రన్ అవుతూ 23 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ దర్శకుడు పోస్టు పెట్టాడు. ‘‘ఈ హిట్ సినిమా విడుదలై 25 వారాలు పూర్తయింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 23 ఏళ్ల తర్వాత ఈ మైలురాయిని సాధించిన తొలి చిత్రంగా 12th ఫెయిల్ నిలిచింది. మా కలను నిజం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యావాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు. దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. గొప్ప సినిమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
చైనాలో విడుదల..
ఇదిలా ఉండగా 12th ఫెయిల్ సినిమా త్వరలో చైనాలో విడుదల కాబోతోంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ మంచి కథకు సరిహద్దులు దాటి ఆదరణ లభిస్తోందన్నారు. చైనాలో విడుదలవుతుందంటే కొత్త ప్రేక్షకులను చేరుకోవడమే కాదు.. ఈ కథ మరికొందరిలో స్ఫూర్తి నింపుతుంది అని తెలిపారు. విడుదలైన ప్రతీ ప్రాంతంలో దీనికి మంచి ఆదరణ లభించింది. చైనీస్ ప్రేక్షకులు దీనితో ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి అని అన్నారు. ఈ సినిమా తర్వాత తన కేరీర్ మారిపోయిందని తెలిపారు. హీరో విక్రాంత్ మస్సే మాట్లాడుతూ ‘ఈ సినిమాతో నేను విజయాన్ని చూశాను. ఆరు నెలల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు వచ్చిన గుర్తింపుని నేను ఎప్పటికీ కొనసాగించాలనుకుంటున్నాను’ అని వివరించాడు.