Kaikala Satyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా కైకాల సత్య నారాయణ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను అపోలో ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేశారు.

ఆ రిపోర్ట్ లో సత్యనారాయణ జ్వరంతో ఈరోజు ఉదయం 7.30 నిమిషాలకు అపోలోలో చేరారు అని ఉంది. అలానే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని… మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని వెల్లడించారు. కోవిడ్ తర్వాత సత్యనారాయణ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారాణి తెలుస్తుంది. ఆయన చికిత్సకు ఆశించినంత మేర స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత నెల 30న కూడా కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 1959 లో సిపాయి కూతురు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి… నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.