Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న రాత్రి 10 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. శ్యాంసుందర్ రెడ్డి వయసు వయసు 86 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా..చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు. విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి. వీరిలో చిన్న వారైన వెంకటరమణారెడ్డిని ఇంట్లో వాళ్లు చిన్నతనం నుంచి ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.పై చదువుల కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన దిల్ రాజు.ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘దిల్’ సూపర్ హిట్ కావడంతో..దిల్ రాజు’ ఇంటి పేరుగా స్థిరపడిపోయింది.
దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఉదయం మహాప్రస్థానం’లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. వాటిలో గేమ్ ఛేంజర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ పలు కారణాలతో షూటింగ్ ఆలస్యం అవుతుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ ఏడాది బలగం మూవీతో దిల్ రాజు మంచి విజయాన్ని అందుకున్నారు.