Tollywood January Review: టాలీవుడ్ కి జనవరి పెద్దగా కలిసి రాలేదు. కానీ, 2021 డిసెంబరులో తెలుగు తెరకు టైమ్ బాగా కుదిరింది. మెరుపులాంటి విజయాలు తెలుగు తెర ఒళ్ళోకి వాలాయి. దాంతో బయ్యర్లలో నిర్మాతలలో మంచి ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో 2022ను బాక్సాఫీస్ వద్ద ఘనంగా ప్రారంభించాలని బాగా ఉబలాట పడ్డారు. కానీ, డిసెంబరులో తగిలిన ఆ మెరుపులాంటి విజయాలు జనవరిలో తగలలేదు. పైగా వచ్చిన ఫలితాలలో లాభాలు కంటే నష్టాలే ఎక్కువుగా ఉన్నాయి.
అసలు సినిమాల పరంగా జనవరి నెలను పూర్తి రివ్యూ చేస్తే.. జనవరిలో ఇప్పటి వరకూ 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ పదింట్లో ఎన్ని హిట్లు అయ్యాయి అంటే.. ఒకే ఒక్క హిట్టు అన్నట్టు ఉంది పరిస్థితి. అది కూడా బంగార్రాజు సినిమానే. నిజానికి ఈ సినిమా కూడా కమర్షియల్ గా కొంతవరకు హిట్ అనిపించుకుంది అంతే.. సినిమాలో అయితే ఆశించిన స్థాయిలో మ్యాటర్ లేదు. విమర్శకుల మెచ్చుకోళ్లు అందుకోలేక చతికిల పడింది ఈ సినిమా.
ఎలాగూ సంక్రాంతి సీజన్ కాబట్టి.. సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి. లేదు అంటే.. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యేది. సరే.. బంగార్రాజు ఫలితం పై విశ్లేషకులు ఎన్ని మాటలు చెప్పినా.. కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా హిట్ అయింది. అంటే.. జనవరిలో టాలీవుడ్ కి దక్కిన ఏకైక హిట్.. బంగార్రాజు మాత్రమే. ఈ నెల తొలి వారంలో విడుదలైన ఆశ – ఎన్ కౌంటర్, ఇందువదన, 1945, అతిథి దేవోభవ.. ఇవన్నీ డిజాస్టర్లకు మించి ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పై మళ్లీ తన పైత్యం చూపించిన వర్మ !
ఇక రానా నటించిన 1945 అనే సినిమా విషయానికి వస్తే.. రానాకి అవమానకరమైన పరాజయం ఎదురైంది. అసలు ఆ సినిమాకు క్లైమాక్స్ కూడా లేదు. రానా ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తాడో ? బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను రానా ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. ఇక సంక్రాంతికి వచ్చిన రౌడీ బోయ్స్, హీరో సినిమాలు కూడా నష్టాల వలయంలో చిక్కుకుని బాగా నలిగిపోయాయి.
ఈ రెండు సినిమాలలో హీరోలు కొత్తవాళ్లు. అసలు ఏ మాత్రం మార్కెట్ లేని హీరోలు. ఇలాంటి హీరోల మీద 4, 5 కోట్లు ఖర్చు పెట్టడం కచ్చితంగా తప్పే. అందుకే, ఈ సినిమాలు ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి. ఈ సినిమాల కోసం పెట్టిన ఖర్చు అంతా, చేసిన ఆర్భాటంగా అంతా ప్రచారాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక ఈ నెలాఖరున విడుదలైన ‘గుడ్ లక్ సఖి’ని కూడా బ్యాడ్ లక్కే వెంటాడింది.
అదేమిటో.. కీర్తి సురేష్ మెయిన్ లీడ్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది ఈ గుడ్ లక్ సఖి సినిమా. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు కంటే.. అఖండ, పుష్ప సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అని టాక్ ఉంది. మరి, కంటెంట్ లేని సినిమాలు వస్తే.. బాక్సాఫీసు దగ్గర విజయాలు సాధించిన సినిమాలకే ఎక్కువ లైఫ్ ఉంటుంది.
మొత్తమ్మీద జనవరి నెల టాలీవుడ్ కి ఏ మాత్రం కలిసి రాలేదు. అయితే ఫిబ్రవరి నెల పై టాలీవుడ్ ఎంతో నమ్మకంగా ఉంది. ఈ నెలలో ఖిలాడీ, శేఖర్, అభిమన్యుడు, ఆడాళ్లూ మీకు జోహార్లు, డీజే టిల్లు లాంటి అంచనాలు ఉన్న క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరీ జనవరి మిగిల్చిన నష్టాలను ఫిబ్రవరి లాభాలు చేస్తుందా ? చూడాలి.
Also Read: సాయిపల్లవి వివాదం: స్పందించిన గవర్నర్ తమిళిసై.. అసలు వివాదమేంటి ?