‘‘థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడు విందు భోజనం చేసి భుక్తాయాసంతో బయటకు రావాలి. అంతేగానీ.. పాచిపోయిన ఉప్మా తిన్నామని వెళ్లగాసి వెళ్లిపోకూడదు.’’ ఇప్పుడు టాలీవుడ్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే! ఆరు పాటలు, నాలుగుఫైట్ల ఫార్ములాకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. మాకు సమ్ థింగ్ డిఫరెంట్ కావాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్న కథానాయకులు.. రచయితలకు వెరైటీ డిష్ కావాలంటూ ఆర్డర్ చేస్తున్నారు. ప్రేక్షకుల ఆశలు, హీరోల అంచనాలను మేళవించి, అద్దిరిపోయే ఫుడ్ ఐటమ్స్ వండుతున్నారు రచయితలు.
పవర్ స్టార్ః పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇమేజ్ ను పక్కనపెట్టి మహిళా సమస్యలపై పోరాడే లాయర్ గా నటించారు. ఈ ప్రయోగానికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చే ‘హరి హర వీరమల్లు’లోనూ ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు పవన్. మొఘల్ పాలకుల శకంలో సాగే కథలో.. పవన్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఈ విధంగా ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచబోతున్నారు.
ప్రభాస్ః రెబల్ స్టార్ ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. రాధే శ్యామ్ స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా రాబోతోంది. ఆ తర్వాత వచ్చే ‘ఆదిపురుష్’లో రాముడిగా కనిపించబోతున్నాడు. సలార్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా.. నాగ్ అశ్విన్ రూపొందించే సైన్స్ ఫిక్షన్ ఓ కొత్త లోకాన్ని పరిచయం చేయనుంది.
ఎన్టీఆర్ః యంగ్ టైగర్ ప్రస్తుతం జక్కన్నతో చేస్తున్న సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయనున్నారు. ఇందులో స్పోర్ట్స్ పర్సన్ గా జూనియర్ కనిపించనున్నట్టు సమాచారం. ఇక, బన్నీ ‘పుష్ప’ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించనున్నారు. రానా విరాట పర్వంలో నక్సలైట్ గా నటిస్తున్నారు. నాని కూడా శ్యామ్ సింగరాయ్ లో పీరియాడికల్ పాత్ర పోషిస్తున్నారు.
ఈ విధంగా కొత్త కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు ముందుకు సాగుతున్నారు. వాటిలో బాగున్నవాటిని ఆడియన్స్ కూడా అక్కున చేర్చుకుంటున్నారు. మరి, రాబోయేవాటిలో ప్రేక్షకులను అలరించే సినిమాలేవో చూడాలి.