
తెలుగు టీవీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ‘బిగ్ బాస్’ ముందు వరసలో ఉంటుంది. అంతేకాదు.. దేశంలోని పలు ఇండస్ట్రీల్లో సాగుతున్న ‘బిగ్ బాస్’ షోలతో కంపేర్ చేస్తే.. తెలుగు షోనే ఎక్కువగా సక్సెస్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. అంతలా ప్రేక్షకులను ఆకర్షించిన ఈ షోకు కరోనా అడ్డంకిగా మారింది. అంతా అనుకున్నట్టుగా కుదిరితే.. బిగ్ బాస్ -5 ఇప్పటికే స్టార్ట్ అయ్యేది. కానీ.. అనివార్యంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీన సీజన్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే.. కంటిస్టెంట్స్ ఎవరన్నదానిపై ఇప్పటి వరకూ ఒక అంచనాకు సైతం జనాలు రాలేకపోతున్నారు. ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ.. ఏది నిజం? ఏది రూమర్? అన్నది క్లారిటీ రావట్లేదు. అంతేకాదు.. ఈ సారి హోస్ట్ కూడా మారుతున్నట్టు సమాచారం. నిన్నామొన్నటి వరకు నాగార్జునే ఉంటారని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు రానా దగ్గుబాటి రావొచ్చని అంటున్నారు. ఇప్పటికే రానా పలు షోలు చేసి తానేంటో నిరూపించుకున్న సంగతి తెలిసిందే.
ఇక, కంటిస్టెంట్లను ఈ సారి కూడా ఓ మోస్తరుగా జనాలకు పరిచయం ఉన్నవారిని, సోషల్ మీడియాలో వైరల్ అయిన వారిని మాత్రమే తీసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది. నిజానికి.. ఫస్ట్ సీజన్లో పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించారు. రెండో సీజన్ కు వచ్చేసరికి వాళ్లు సగానికి తగ్గిపోయారు. 3, 4 సీజన్లలో ఒకరిద్దరు మినహా.. ఎవరూ జనాలకు తెలిసినవాళ్లు లేరు. షోకు వచ్చిన తర్వాతే వాళ్లు ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్లనే తేబోతున్నారన్నది టాక్. వీరిలో షన్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంత్, సీరియల్ నటుడు శ్రీహాన్, చైతన్య రావు, అనన్య, టిక్ టాక్ దుర్గారావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. టాలీవుడ్ యంగ్ హీరో కూడా హౌస్ లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడు, ‘రాజుగారి గది-3’ హీరో అశ్విన్ బాబు బిగ్ బాస్ సీజన్-5లోకి అడుగు పెడుతున్నట్టు సమాచారం. సోదరుడు ఓంకార్ ఈ మేరకు అంతా సెట్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే.. సినిమా హీరోగా తెరంగేట్రం చేసిన అశ్విన్.. బిగ్ బాస్ మరింత ఫేమస్ అయ్యేలా ఓంకార్ స్కెచ్ వేశారని అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది చూడాలి.