Telugu Comedian Ali: హావభావాల హాస్యానికి చిరునామ ఆయన, నాలుగు దశాబ్ధాల నుంచి తెలుగు తెర పై నవ్వులతో అలరించిన అనుభవం ఆయనది, ఎలాంటి పాత్ర అయిన సరే, ఆ పాత్రకు కూడా నవ్వడం నేర్పించగలిగే చాతుర్యం ఆయనది, అసలు ఆయన నవ్వులోనే అంతర్లీనమైన హాస్యం పొంగిపోర్లుతూ ఉంటుంది. ఆయనే అలీ. 1968 అక్టోబరు 10 తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు అలీ.
అలీ(Telugu Comedian Ali) తాతగారు బర్మాలో వ్యాపారం చేసేవారు. అయితే, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అలీ పూర్వికులు బర్మాను వదలి ఆంధ్రాకి వచ్చారు. మొదట్లో నెల్లూరులో ఉన్నా… ఆ తర్వాత కాలంలో రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఇక అలీ తండ్రి అబ్దుల్ సుభాన్ దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించారు. అలీ చిన్నప్పటి నుంచే చదువు మీద ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో నటన పై ఆసక్తి పెరిగింది.
కెరీర్ తెలిరోజుల్లో శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో జాయిన్ అయ్యాడు. ఆ బృందంలో మిమిక్రీ కళాకారుడిగా అనేక ప్రదర్శనలిస్తూ తనకు తాను మార్చుకుంటూ ఎదిగారు. అలీ సినీరంగ ప్రస్థానం ఎలా జరిగింది అంటే.. ఓ రోజు రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతూ ఉంది. అయితే, షూటింగ్ చేసి అలిసిపోయిన చిత్రబృందానికి వినోదం పంచడానికి అలీ బృందం వచ్చింది.
అక్కడ అలీ టాలెంట్ చూసి ముచ్చట పడిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో అలీకి బాలనటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కారణంగానే ఆ తర్వాత కాలంలో దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి లాంటి అనేక చిత్రాల్లో అలీకి బాలనటుడిగా అవకాశాలు వచ్చాయి. దాంతో అలీ రాజమండ్రి నుంచి చెన్నై వెళ్లి అవకాశాలు కోసం తిరుగుతూ ఉండేవారు.
మేటి దర్శకుడు భారతీరాజా తన ‘సీతాకోక చిలుక’ సినిమా కోసం బాలనటులను వెతుకుతున్నారు. ఆ విషయం తెలిసి, చెన్నైలోని భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు ఆలీ. భారతీరాజా అలీ ప్రతిభకు మెచ్చి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. అలాగే ప్రేమఖైదీ సినిమాలో ఆలీ మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.