తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మీనారాయణ గుప్తా అంటే.. జనాలకు పెద్దగా తెలియదు. కానీ.. టార్జాన్ అంటే చాలా మందికి తెలుసు. ఈ పేరు కూడా తెలియని వారు అతన్ని చూస్తే మాత్రం గుర్తు పట్టేస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన టార్జాన్.. ఎక్కువగా విలన్ పాత్రలే పోషించారు. దాదాపు ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. శివ, గాయం, క్షణక్షణం, పోకిరి వంటి ఎన్నో చిత్రాల్లో మెప్పించారు. అయితే.. ఈ మధ్యనే ఆయన సతీమణి చనిపోయారు. దీంతో.. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తన వ్యక్తిగత జీవితం గురించి, కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
పరిగి పంచాయతీ పరిధిలోని రాపోలు అనే పల్లెటూరుకు చెందిన లక్ష్మీనారాయణ.. టార్జాన్ లా ఎలా మారారు? అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అనే విషయాలను వెల్లడించారు. ‘‘మా ఊరిలో మేం బాగానే బతికాం. మా నాన్న సర్పంచ్ గా ఉండేవారు. నాకు ముగ్గురు అన్నయ్యలు. అయితే.. మేమంటే పడనివారు మా కుటుంబానికి చేతబడి చేయించారు. దీంతో.. మా ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. దాదాపు రెండేళ్లపాటు ప్రత్యక్ష నరకం చూశాం.’’ అని చెప్పారు టార్జాన్.
ఈ బాధలు దాదాపు 13 సంవత్సరాలు కొనసాగాయని చెప్పారు. అవి గుర్తువస్తే.. ఇప్పటికీ ఆందోళన కలుగుతుందని అన్నారు. ‘‘మా అన్నయ్య అన్నం తింటే వాంతులు వచ్చేవి. మా ఊరు పొలిమేర దాటి బయటకు వెళ్తే.. మామూలుగానే ఉండేవాడు. ఊళ్లోకి వచ్చి నీళ్లు తాగినా.. వాంతులు అయ్యేవి. నేను కూడా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాను. ఈ పరిస్థితుల్లోనే కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చేశాం’’ అని చెప్పారు టార్జాన్.
ఈ క్రమంలో ఎన్నో కష్టాలు అనుభవించానని చెప్పారు. ఆ క్రమంలోనే సినిమాల్లో వేశాలకోసం తిరిగినట్టు చెప్పిన టార్జాన్.. రామ్ గోపాల్ వర్మ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానన్నారు. అయితే.. ఇండస్ట్రీలోనూ ఎన్నో ఇబ్బందులు పడినట్టు చెప్పారు. ఇక్కడ టాలెంట్ తోపాటు అదృష్టం కూడా ఉండాలంటారు టార్జాన్.
బాణామతి, చేతబడి ఉంటాయా? అన్నప్పుడు.. ‘‘ఇప్పటి వాళ్లు దాన్ని నమ్మకపోవచ్చు.. కానీ నేను నమ్ముతాను. పౌర్ణమి, అమావాస్య ఉన్నాయంటే.. చేతబడి వంటివి కూడా ఉంటాయి.’’ అని చెప్పుకొచ్చారు టార్జాన్. ప్రస్తుతం తన జీవితం అంతా బాగుందని, దైవ చింతనతో జీవితాన్ని గడిపేస్తున్నట్టు చెప్పారు.