కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నప్పటికీ.. అవి త్వరగానే కోలుకున్నాయి. కానీ.. సినీ రంగం మాత్రం ఇంకా కుదురుకోలేదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేకుండా ఉంది. అందుకే.. అవకాశం ఉన్నప్పుడే సినిమాలను వదలాలని చూస్తున్నారు నిర్మాతలు. థియేటర్లు తెరుచుకున్న రెండు వారాల్లోనే పన్నెండు సినిమాలు రిలీజు కావడం.. మూడు వారంలో 9 సినిమాలు విడుదలకు సిద్ధమవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మిగిలిన చిత్రాలు కూడా వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి క్రేజీ అప్డేట్స్ చూద్దాం.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూవీ పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని.. రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను శుక్రవారం రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్న ‘‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’’ అనే పాటకు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో బన్నీ లుక్ ఊర మాస్ అన్నట్టుగా ఉంది.

నిఖిల్ అప్ కమింగ్ మూవీ ‘18 పేజీలు’. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్ర షూట్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. గురువారం నుంచి డబ్బింగ్ మొదలు పెట్టాడు హీరో నిఖిల్. డబ్బింగ్ పూర్తికాగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టారు.

సుధీర్ బాబు – ఆనంది జంటగా నటిస్తున్న మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ పల్లెటూరి ప్రేమకథను కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించింది యూనిట్. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

అక్కినేని సుమంత్ – నైనా గంగూలీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్లీ మొదలైంది’. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్టు లాయర్ కుటుంబరావు పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. గురువారం ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్.