సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రేమకథలు చక్కటి ఆప్షన్. కానీ.. అన్ని వర్గాల ప్రజలను అలరించాలంటే మాస్ మంత్రం జపించాల్సిందే. ‘లవర్ బోయ్’ ట్యాగ్ మెళ్లో వేసుకొని ఎక్కువ కాలం ఇండస్ట్రీని ఈదడం కష్టం. అందుకే.. ఆ ట్యాగ్ ను మార్చుకొని యాక్షన్ హీరోగా ప్రమోట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు చాలా మంది నవతరం హీరోలు! మరి, వారు ఎవరు? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది చూద్దాం.
రామ్ పోతినేనిః ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ కెరీర్ ను పరిశీలిస్తే.. అందులో క్లాస్ మూవీస్ మాత్రమే ఉంటాయి. అందులోనూ లవర్ బాయ్ తరహా సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ జర్నీని వెంటనే టర్న్ చేయాలని డిసైడ్ అయ్యాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను వెండితెరపై లాంచ్ చేశాడు. ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’ సినిమాలోనూ డబుల్ రోల్ పోషించి, యాక్షన్ ను కంటిన్యూ చేశాడు. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ మాస్ కంటెంట్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. మరి, ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: సెట్స్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ పిక్స్ లీక్.. మంటలు రేపుతున్న చిత్రాలు!
నానిః నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని అంటే.. ఖచ్చితంగా లవర్ బోయ్ మాత్రమే కళ్ల ముందు కదలాడుతాడు. ఆయన గత చిత్రాలన్నీ ఆ తరహాలోనే సాగాయి. అయితే.. తన కెరీర్ మొత్తం ప్రేమ కథలతోనే నిండిపోయిందని గుర్తించినట్టున్నాడు.. మాస్ హీరోగా మారేందుకు ట్రై చేస్తున్నాడు. కృష్ణార్జున యుద్ధంలో కాస్త మాస్ ట్రై చేసిన నాని.. ‘వి’ చిత్రంతోనూ మాస్ రోల్ పోషించాడు. ఇప్పుడు ‘టక్ జగదీష్’లోనూ యాక్షన్ రిపీట్ చేయబోతున్నాడు. యాక్షన్ విత్ ఫ్యామిలీ డ్రామా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్ కాబోతోంది. దీంతోపాటు రాబోతున్న ‘శ్యామ్ సంగరాయ్’లోనూ గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు నాని.
వరుణ్ తేజ్ః మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తనపై పడ్డ సాఫ్ట్ మరకను తుడిపేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ‘గద్దల కొండ గణేష్’తో అద్భుతమైన మేకోవర్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు వరుణ్. భారీ కాయుడిగా.. యాక్షన్ అదరగొట్టాడు. ఇప్పుడు ‘గని’ చిత్రంతో రాబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్నాడు. తమిళ్ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా మాస్ హీరోగా స్థిరపడిపోవాలని చూస్తున్నాడు వరుణ్.
Also Read: ప్చ్.. లోలోపలే కుంగిపోతున్న బాలయ్య !
విజయ్ దేవరకొండః వీడీ గత చిత్రాలన్నీ లవ్ బ్యాక్ డ్రాప్ తోనే వచ్చాయి. ‘నోటా’ మాత్రమే పాలిటిక్స్ జోన్ లో వచ్చింది. అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరో లవ్ చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో.. ప్రేమ కథలకు గుడ్ బై చెప్పబోతున్నానంటూ ప్రకటించాడు వీడీ. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రం ద్వారా మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ద్వారా.. మాస్ హీరోగా మారిపోవాలని చూస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.
నాగశౌర్యః నిన్నా మొన్నటి వరకూ క్యూట్ లవర్ బోయ్ గా కనిపించిన నాగశౌర్య కూడా మాస్ జపం చేస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ‘అశ్వథ్థామ’తో యాక్షన్ బాట పట్టిన శౌర్య.. త్వరలో ‘లక్ష్య’ సినిమాతో అలరించబోతున్నాడు. ఆర్చరీ నేపథ్యంలో సంతోష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. అయితే.. మరో మూడు ప్రేమ కథల్లోనూ నటిస్తున్నాడు శౌర్య. కొంతకాలం రెండు పడవలపై ప్రయాణించాలని చూస్తున్నాడో ఏమో!
నితిన్ః ఈ యంగ్ హీరో కెరీర్ డిఫరెంట్ గా సాగుతోంది. లవ్ స్టోరీతోనే ఇండస్ట్రీకి వచ్చిన నితిన్.. ఆ తర్వాత కొన్ని మాస్ చిత్రాల్లో నటించాడు. అవి పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో మళ్లీ ప్రేమకథా చిత్రాలే చేస్తున్నారు. అయితే.. ఇక లవ్ స్టోరీస్ ను పూర్తిగా పక్కనపెట్టే టైం వచ్చిందని డిసైడ్ అయ్యాడు నితిన్. ఆయన రాబోతున్న చిత్రం ‘రంగ్ దే’ లాస్ట్ లవ్ స్టోరీ అని చెప్పేశాడు. ఈ చిత్రం తర్వాత ‘పవర్ పేట’, ‘అందాధున్’ రీమేక్ లతో యాక్షన్ కంటిన్యూ చేయబోతున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈ విధంగా.. తమలోని ప్రేమికుడిని సైడ్ చేసి, యాక్షన్ హీరోను మెయిన్ ట్రాక్ ఎక్కించేందుకు ట్రై చేస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. మరి, ఎవరు ముందుకు దూసుకెళ్తారు? ఎవరు తడబడతారు? అన్నది భవిష్యత్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంది. మనం మాత్రం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.