Shivaji sensational statement: ప్రముఖ నటుడు శివాజీ(Actor Sivaji) ‘దండోరా'(Dhandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించింది. సినీ ఇండస్ట్రీ లో ఆయనకు సపోర్టు చేసే వాళ్ళు ఈ అంశం లో ఒక్కరు కూడా లేరు. అంతెందుకు, దండోరా చిత్రం లో తనతో పాటు కలిసి నటించిన హీరోయిన్ బిందు మాధవి కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. తన సినిమా టీంకి సంబందించిన వాళ్ళే తప్పుబడుతున్నప్పుడు, ఇక మిగిలిన సెలబ్రిటీలు తప్పుబట్టడం లో వింతేమీ ఉంది. అనసూయ, చిన్మయి,మంచు మనోజ్, మంచు లక్ష్మి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఈ అంశంపై స్పందిస్తూ శివాజీ పై అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా నేడు శాసన మండలి సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ 14 నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి విడుదల చేశారు.
ఇది కాసేపు పక్కన పెడితే శివాజీ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమీషన్ నుండి నోటీసులు రావడం తో, నేడు ఆయన మహిళా కమీషన్ ఎదుట హాజరయ్యాడు. విచారణ ముగించుకొని బయటకు వస్తున్న సమయం లో శివాజీ మీడియా తో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘మహిళా కమీషన్ కి హాజరు అవ్వడం జరిగింది. అక్కడ నన్ను మేడం గారు వివిధ కోణాల్లో అందరి వైపు నుండి ప్రశ్నలు అడిగారు. నేను సమాధానం చెప్పాను. మీరు ఒక పాపులర్ సెలబ్రిటీ, ఎంతో మంది కుర్రాళ్లను ప్రభావితం చేయగల రంగం నుండి వచ్చారు. మీ మాటలను ఆదర్శంగా తీసుకొని, మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడితే స్త్రీ గౌరవం ఏమవుతుంది? అని అడిగారు, నిజమే కదా మేడం, అందుకే క్షమాపణలు చెప్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా మీద ఇండస్ట్రీ లో కొంతమంది చాలా పగబట్టేసారు. నాకు సపోర్టు గా ఉంటూ, నా నటన ని మెచ్చుకుంటూ, నేను సన్నిహితంగా భావించే వాళ్ళు కూడా నన్ను విమర్శించేవాళ్లతో జూమ్ కాల్ మీటింగ్స్ పెట్టి మరీ విమర్శిస్తున్నారు. అంత తప్పు నేనేమి చేసాను. ఆడబిడ్డలు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకేంటి అమ్మా. నేను ఒక తండ్రి స్థానం లో కూర్చొని, ఇలా ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చాను అంతే. ఇష్టముంటే ఆ సలహా ని తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఇంత మాత్రానికి ఈ రేంజ్ రాద్ధాంతం చేయాలా?, ఒకరు అయితే రోజు అదే పనిగా లేని పోనీ వ్యాఖ్యలు చేసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అసలు రంగు కూడా త్వరలోనే బయటపెడుతా, ఆధారాలు ఉన్నాయి’ అంటూ కామెంట్స్ చేసాడు శివాజీ.