
అంతా అనుకున్నట్టుగా కుదిరితే.. బిగ్ బాస్ -5 ఇప్పటికే స్టార్ట్ అయ్యేది. కానీ.. కొవిడ్ సెకండ్ వేవ్ సమస్యతో సినిమా షూటింగులు మొదలు.. బిగ్ బాస్ షో దాకా అన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే.. క్రమంగా కరోనా తగ్గుతుండడంతో ఈ సీజన్ కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆగస్టు చివరి వారంలో లేదా.. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తెలంగాణలో తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగులు స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. బిగ్ బాస్ షో స్టార్ట్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. షో పార్టిసిపెంట్లను వెతకడమే అతిపెద్ద టాస్క్. తర్వాత వాళ్లకు ఆడిషన్స్ చేయాలి. మూడు మాసాలపాటు హౌస్ లో ఉండడానికి అవసరమైన ట్రెయినింగ్ ఇవ్వాలి. హౌస్ సెట్టింగ్ వేయాలి. ఇలా.. ఎన్నో అంశాలు ఉన్నాయి.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సీజన్-5కి హోస్ట్ మారుతున్నట్టు సమాచారం. నిన్నామొన్నటి వరకు నాగార్జునే ఉంటారని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు రానా దగ్గుబాటి రావొచ్చని అంటున్నారు. ఇదే క్రమంలో కంటిస్టెంట్ల గురించిన చర్చ కూడా వచ్చింది. అయితే.. సెలబ్రిటీలను కాకుండా మామూలు సోషల్ మీడియాతో పాపులర్ అయిన వారిని మాత్రమే షోకు సెలక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.
వాస్తవానికి ఫస్ట్ సీజన్లో పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించారు. రెండో సీజన్ కు వచ్చేసరికి సగానికి తగ్గిపోయారు. 3, 4 సీజన్లలో ఒకరిద్దరు మినహా.. వాళ్లంతా ఎవరో జనాలకు తెలియని పరిస్థితి. ఈ సీజన్ కూడా అలాగే ఉండబోతోందని అంటున్నారు. దీనికి కారణం కూడా ఉందంటున్నారు. సెలబ్రిటీలను తీసుకుంటే.. వాళ్లకు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడంతోపాటు పలు కండీషన్లు పెడతారు. కానీ.. వీళ్లైతే ఇచ్చినంత తీసుకుంటారు. పైగా కండీషన్లు ఉండవు. చెప్పింది చేస్తారు. ఈ కారణంగానే ఈ సారి కూడా ఇలాంటి వాళ్లపైనే దృష్టి పెట్టినట్టు సమాచారం.
తాజాగా.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.
ఇందులో ఉన్నవారంతా సోషల్ మీడియాలో కనిపించేవారే. వీరిలో షన్ముఖ్ జశ్వంత్ తప్ప, మిగిలినవాళ్లు ఎవ్వరూ పెద్దగా తెలియదు. వీరు బిగ్ బాస్ 5 లో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. సిరి హనుమంత్, సీరియల్ నటుడు శ్రీహాన్, చైతన్య రావు, అనన్య ఈ ప్రోమోలో ఉన్నారు. మరి, వీరిలో ఎందరు బిగ్ బాస్ షోలో అడుగు పెడతారో చూడాలి.