Triagle War: దీపావళి వచ్చిందంటే చాలు బాణాసంచ శబ్దాలతో పాటు, థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్ల శబ్దాలు హోరెత్తిపోతాయి. ఈ ఏడాది దీపావళికి బాక్స్ఆఫీస్ వద్ద పోటీపడేందుకు మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దర్శకులతో పాటు, హీరోలు పోటాపోటీగా రెడీ అవుతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందించిన మంచి రోజులు వచ్చాయి సినిమాతో పాటు, రజినీకాంత్ హీరోగా వస్తున్న పెద్దన్న, విశాల్ చిత్రం ఎనిమీ నవంబరు 4న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా “మంచి రోజులు వచ్చాయి”. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరన పొందింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన “అన్నాత్తే” గురువారం విడుదలకు సిద్ధమైంది. పెద్దన్న పేరుతో తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ రజనీ చెల్లెలుగా కనిపించనుంది. నయనతార, మీనా, ఖుష్బూ వంటి ప్రముఖులు కీలకపాత్రల్లో నటించారు.
ఇక విశాల్, ఆర్య కలిసి నటించిన “ఎనిమీ” ఈ దీపావళికి థియేటర్లలో పేలేందుకు సిద్ధమయ్యింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. మొత్తానికి నవంబరు4న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు జరగనుంది. మరి ఈ దీపావళికి ఏ సినిమా బాక్సాఫీసు బద్దలు చేయనుందో వేచి చూడాలి.