RRR Oscar- Rajamouli: ప్రపంచ సినిమా వేదికపై ఆస్కార్ ని ముద్దాడాలని ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు కోరుకుంటాడు. అంతకు మించిన గౌరవం లేదు, లైఫ్ టైం అచీవ్మెంట్ గా భావిస్తారు. అలాంటి ఆస్కార్ భారతీయులకు అందని ద్రాక్షే. దేశంలో సినిమా ప్రస్థానం మొదలై వందేళ్లు దాటింది. దాదాపు 90 ఏళ్లుగా ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు. కానీ ఈ అవార్డు అందుకున్న భారతీయులు పట్టుమని పది మంది లేరు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సినిమా ప్రమాణాలు, కంటెంట్, స్థానికత, భాష, అంతర్జాతీయ గుర్తింపు వంటి పలు అంశాలు నిర్దేశిస్తాయి.

ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అందుకునే అర్హత ఉందా?… అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కంటెంట్ పరంగా చూస్తే చాలా వీక్. అడవి తెగకు చెందిన ఇద్దరు వీరులు బ్రిటీష్ వారిపై చేసిన పోరాటానికి సంబంధించిన సాదాసీదా స్టోరీ. స్వాతంత్య్రం వచ్చాక ఈ తరహా కథలతో వందల చిత్రాలు వివిధ భాషల్లో విడుదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రత్యేకత ఏమిటంటే భారీ బడ్జెట్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా వంటి స్టార్ క్యాస్ట్, బాహుబలి దర్శకుడన్న బ్రాండ్ నేమ్. అంతకు మించి ఏమీ లేదు.
కమర్షియల్ చిత్రాలకు ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వరు. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో మాత్రమే అవార్డ్స్ దక్కుతాయి. అంటే విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటివి అన్నమాట. ఆ కోణంలో చూస్తే ఆర్ ఆర్ ఆర్ అట్టడుగున ఉంటుంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం డైరెక్టర్ స్పీల్బర్గ్ డైనోసార్ ని చూపించిన సహజత్వంలో పదో వంతు కూడా ఎన్టీఆర్ పై దాడి చేసిన పులి లేదు. కాబట్టి ఆ విభాగాల్లో ఆస్కార్ ఆశించడం అత్యాశే అవుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ గొప్పగా నటించినా అకాడమీ సభ్యులను మెప్పించడం కష్టమే.
తెల్ల జాతి వారిని తిడుతూ కొడుతూ… వాళ్ళను వెర్రి వెంగళప్పలుగా, క్రూరులుగా చూపించి అకాడమీ సభ్యులను మెప్పించడం కష్టమే. జాతి అహం, అభిమానం అనేది ప్రతివాడికి ఒకటి ఏడుస్తుంది. అందులోనూ చరిత్ర గమనిస్తే భారతీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు ఆస్కార్స్ గెలిచాయి కానీ భారతీయులు తెరకెక్కించిన చిత్రాలు కాదు. 1982లో విడుదలైన గాంధీ చిత్రం ఏకంగా 18 అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన భారతీయుడు రవిశంకర్ మరొక సంగీత దర్శకుడితో సంయుక్తంగా ఆస్కార్ గెలుచుకున్నారు. గాంధీ ఇండియన్ లీడర్ అయినప్పటికీ ఆ చిత్ర నటులు, సాంకేతిక నిపుణులు విదేశీయులే. అది గాంధీ పై తెరకెక్కిన విదేశీ చిత్రం కాబట్టే అన్ని అవార్డ్స్ కి ఎంపికైంది.

గాంధీ తర్వాత ఆ స్థాయిలో ఆస్కార్ వేదికపై మెరిసిన భారతీయ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్. నిజం చెప్పాలంటే ఇది కూడా ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన విదేశీ చిత్రం ఏ ఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి ఆ చిత్రానికి పని చేసి ఆస్కార్స్ గెలుచుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ దర్శకుడు విదేశీయుడు కావడం గమనార్హం. చరిత్రలో మదర్ ఇండియా, సలామ్ మోంబే, లగాన్ ఆస్కార్ బరిలో గట్టిపోటీ ఇచ్చాయి కానీ అవార్డు అందుకోలేదు. బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే మాత్రం గౌరవ ఆస్కార్ అందుకున్నారు.
అవార్డ్స్ నిర్ణయించే కమిటీ సభ్యులు విదేశీయులు కాగా భారతీయ చిత్రాలపై వాళ్ళు సీత కన్నే వేశారు. ఇకపై వేస్తారు కూడా. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా పక్కన పెట్టిన వారు ఆర్ ఆర్ ఆర్ కి అవార్డులు కురిపిస్తారనుకోవడం అవివేకమే. అలాగే ఆర్ ఆర్ ఆర్-ఆస్కార్ ప్రచారం వెనుక మేకర్స్ ఉన్నారన్నది నిజం. హాలీవుడ్ వాళ్ళు ఆర్ ఆర్ ఆర్ అదుర్స్ అంటూ ట్విట్టర్ లో రెట్టలు వేయడం దానిలో భాగమే. లాబీయింగ్, మధ్యవర్తిత్వంతో ఆర్ ఆర్ ఆర్ పై లేని ఇంటర్నేషనల్ హైప్ క్రియేట్ చేయ ప్రయత్నం జరిగింది.
ఆ విధంగా ఆస్కార్ బరిలో నిలవాలని కొన్ని నెలలుగా పకడ్బందీ ప్రణాళికలు వేస్తున్నారు. అవార్డ్స్ రాకపోయినా కనీసం ఎంపికైందని చెప్పుకోవాలని ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఎన్టీఆర్ కి ఆస్కార్, రామ్ చరణ్ కి ఆస్కార్ అంటూ అందరినీ తప్పుదోవ పట్టించారు. తీరా జ్యూరీ సభ్యులు మొండి చేయి చూపడంతో మిన్నకుండిపోయారు. దర్శకుడికి మించి మార్కెటింగ్ జీనియస్ గా పేరుగాంచిన రాజమౌళి తన తదుపరి చిత్ర మార్కెట్ పెంచుకోవడంలో ప్రణాళికగా కూడా దీన్ని చూడవచ్చు అంటున్నారు.
[…] […]