‘పవిత్ర ప్రేమ’ (Pavitra Prema) సినిమా ప్రివ్యూ వేస్తోన్న రోజు అది. ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా ఆ సినిమా చూడటానికి వచ్చారు. అయితే, ప్రివ్యూలకు ఎప్పుడు రాని బాలయ్య బాబు (Balayya Babu) కూడా ఆ సినిమా ప్రివ్యూకి వచ్చారు. సినిమా మొదలైంది. మధ్యలో కొంతమంది లేచి వెళ్లిపోయారు. ఉన్న వాళ్లల్లో ఎక్కువ మంది ఇలాంటి సినిమాని మనవాళ్ళు చూడరయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతలు చంటి అడ్డాల, శ్రీనివాసరెడ్డిలలో టెన్షన్ మొదలైంది.
దూరంగా కూర్చుని ఆలోచనలో పడ్డారు. సినిమా ప్లాప్ అయితే, ఇక అంతే సంగతులు అనుకుంటూ ఇద్దరు ఒకరివైపు ఒకరు బాధగా చూసుకుంటూ ఉండిపోయారు. వెనక నుండి ఎవరో వచ్చిన అలికిడి. చంటి అడ్డాల వీపు మీద ఒక చేయి పడింది. తల ఎత్తి చూస్తే.. ఎదురుగా బాలయ్య బాబు నవ్వుతూ కనిపించాడు.
నిర్మాతలు మొహం చూసి.. ‘ఏం పర్వాలేదు. మన సినిమా సూపర్ హిట్ అవుతుంది, మీ తర్వాత సినిమాకి కూడా నేనే డేట్లు ఇస్తున్నా’ అని కథ కూడా వినకుండానే బాలయ్య వాళ్లతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో నిర్మాతలు చంటి అడ్డాల, శ్రీనివాసరెడ్డిల మోహంలో ధైర్యం వచ్చింది. బాలయ్య చెప్పినట్టుగానే ‘పవిత్ర ప్రేమ’ మంచి విజయం సాధించింది.
ఆ ఉత్సాహంతో బాలకృష్ణకు మరో గొప్ప సినిమా ఇవ్వాలనే కసితో నిర్మాతలు పనులు మొదలుపెట్టారు. దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను తీసుకున్నారు. కథ ఫైనల్ చేశారు. సినిమాకి ‘కృష్ణబాబు’ అని టైటిల్ పెట్టారు. ఇతర కీలక పాత్రల్లో అబ్బాస్, మీనా, రాశిలను ఎంపిక చేశారు. బాలయ్య నిర్మాతల మీద నమ్మకంతో కథ కూడా వినలేదు.
అయితే, బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని నిర్మాతలు సద్వినియోగం చేసుకోకపోగా పెద్ద పొరపాటు చేశారు. బాలయ్య సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలోనే మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. దాంతో ‘కృష్ణబాబు’ సినిమా పై ఏకాగ్రత పెట్టలేకపోయారు నిర్మాతలు. ఆ సినిమా మిక్సింగ్ సమయంలో చాలా పొరపాట్లు జరిగాయి. థియేటర్లలో సౌండ్ తేడా వచ్చింది. సరిగ్గా మాటలు వినపడక జనం గోల గోల చేశారు. ఆ సినిమా విషయంలో బాలయ్య చాలా ఫీలయ్యాడు. కానీ నిర్మాతలను ఒక్క మాట కూడా అనలేదు.