కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ చూపించాడు. అదృష్టం కలిసి వచ్చి.. రెండో సినిమాకి మంచి బజ్ వచ్చింది. పైగా ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమాకి ఈ స్థాయిలో బజ్ రాలేదు. టైటిల్ లోనే కొత్తదనం చూపించేలా ‘SR కళ్యాణమండపం’ అని పెట్టి.. భిన్నమైన ఎమోషనల్ డ్రామా అంటూ కొడుకు – తండ్రిల మధ్య ఫీల్ గుడ్ డ్రామా అంటూ సినిమాని వదిలారు.
ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమాకి మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక చిన్న హీరోకి.. అది కూడా ఈ కరోనా లాంటి కష్ట కాలంలో థియేటర్స్ ఫుల్ అవ్వడం అంటే.. ఇక కిరణ్ అబ్బవరం దశ తిరిగినట్టే అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. రెండో రోజుకు కలెక్షన్స్ సగానికి పడిపోయాయి. దానికి తోడు సినిమా పై నెగిటివ్ టాక్ ఎక్కువైపోయింది.
సినిమాలో అనవసరంగా ఓవర్ మాస్ ఎలిమెంట్స్ పెట్టారు అంటూ కిరణ్ పై విమర్శలు కూడా పెరిగాయి. స్టార్ హీరోలు ఫైట్ లు చేస్తుంటేనే జనం చూడటం లేదు. అలాంటిది ఒక కొత్త హీరోకి ఈ రేంజ్ ఫైట్లు ఎందుకు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు . అనవసరమైన యాక్షన్ సీన్స్ తో సినిమాని బోరింగ్ ప్లేతో నడిపారని ‘SR కళ్యాణమండపం’ టీం పై అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.
మొత్తానికి స్టార్ అయ్యే గొప్ప అవకాశాన్ని కిరణ్ అబ్బవరం చెడగొట్టుకున్నాడు. అదే ఈ సినిమా ఊహించినట్టే హిట్ అయి ఉంటే.. కిరణ్ రేంజ్ మరోలా ఉండేది. కానీ సినిమా ప్లాప్ అవడంతో కిరణ్ ఊపు తగ్గింది. అతని డేట్లు కోసం ఎగబడిన నిర్మాతలు మళ్ళీ ఆలోచనలో పడ్డారు. మొత్తమ్మీద ఈ హీరో లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.