Telugu Heroes: కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం ఊపు పెరిగినపుడు, పాత తరం జోరు తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే.. తగ్గించడానికి పక్కన ఉన్న ‘పాచి’ అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అదృష్టం బాగుండి, ఒక హీరోకు రెండు హిట్ లు పడ్డాయి అనుకుందాం. అంతే.. హిట్ వచ్చింది అనే వార్త అందరికీ తెలిసే లోపే.. ఆ హీరోగారు తన రెమ్యూనిరేషన్ అమాంతం పెంచేస్తాడు.

సరే.. హీరో ముచ్చట పడుతున్నాడు, నాలుగు రూపాయిలు ఎక్కువ ఇచ్చి సినిమా చేద్దాం అని ఉబలాట పడే పార్ట్ టైమ్ ప్రొడ్యూసర్లు కొంతమంది, హీరోలు అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతారు. వాళ్ళదేం పోయింది. ఎదో ఒకటి రెండు సినిమాలు చేసి చేతులు కాలినా, కావాల్సిన పేరు తెచ్చుకుని, సరదాలు తీర్చుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారు.
అయితే, సదరు హీరోలు మాత్రం పెంచిన రెమ్యునరేషన్ ను మాత్రం తగ్గించరు. దీనికితోడు ఎన్నో గొంతెమ్మ కోరికలు కోరతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిడ్ రేంజ్ హీరోల వ్యవహారం ఇలాగే ఉంది. అందుకే, నిర్మాతలు కొత్త హీరోలను తీసుకువస్తున్నారు. ఒకపక్క పెరిగిన సాంకేతిక నైపుణ్యం కారణంగా సామాన్యుడు కూడా హీరో అయిపోతున్నాడు.
దాంతో హీరో విలువ తగ్గిపోతుంది. కొత్త కొత్త హీరోలు వస్తూ.. చిన్నాచితకా హిట్లు కొడుతూ మొత్తానికి మిడ్ రేంజ్ హీరోల క్రేజ్ ను తగ్గిస్తున్నారు. ఒకప్పుడు ఒక హీరోకి రెండు హిట్లు వస్తే.. ఇక ఆ హీరోకి పదేళ్ల పాటు వరుస సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి సినిమాకి పెద్ద పరీక్ష అయిపోయింది. ఏ హీరో అయినా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడా..? ఇక ఆ హీరో మొహం కూడా నిర్మాతలు చూడటానికి ఇష్టపడట్లేదు.
నిజంగానే ప్లాపుల్లో వున్న హీరోల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఇప్పటికే కొందరు హీరోలు రెమ్యూనరేషన్లు లేకుండా సినిమాలు చేస్తున్నారు. సినిమా హిట్ అయి లాభాలు వస్తే.. షేర్ ఉంటుంది. ఒకవేళ సినిమా ప్లాప్ అయినా, లేక లాభాలు రాకపోయినా రూపాయి కూడా రాదు. అంటే… సంవత్సర తరబడి సినిమా చేయడం వృధానే.
హిట్ అయితేనే డబ్బు. ఏడాది 190 సినిమాలు రిలీజ్ అయితే హిట్ అయ్యేది పది సినిమాలు. దీనిబట్టి మెజార్టీ మిడ్ రేంజ్ హీరోలకు సంపాదన దూరం అయినట్టే.