Tollywood Drugs Case
Tollywood Drugs Case: నవదీప్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇవాళ విచారణకు హాజరుకానున్నాడు. ఇంకా కొంతమంది నిర్మాతలు ఆ రొంపి లో ఉన్నారు. మరి కొంతమంది నటులు డ్రగ్స్ వినియోగదారులుగా ఉన్నారు. అసలు నటీనటులకు డ్రగ్స్ తో ఏం సంబంధం? అసలు వారికి డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఏంటి? ఈ రాకెట్ లో ఎవరు పాత్రధారులు, మరెవరు సూత్రధారులు.. సరుకు ఎక్కడినుంచి ఎక్కడికి వస్తోంది.. ఎవరి ద్వారా వీరికి చేరుతోంది.. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరివి..ఇవీ ప్రస్తుతం తెలుగు సినిమాను కుదిపేస్తున్న ప్రశ్నలు.
ప్రధాన నిందితుడు రామ్ ను పట్టుకునేందుకు..
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు రామ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నానికి చెందిన రామ్ పట్టుబడితే మరికొందరి పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. డ్రగ్స్ దందాలో భాగస్వాములైన సినిమావాళ్ల గుట్టు రట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులో ఉండే నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన రామ్ వాటిని కప్పా భాస్కర్, బాలాజీ ద్వారా విక్రయించేవాడు. బాలాజీ వాటిని నిర్మాత వెంకటరత్నారెడ్డి, దేవరకొండ సురేష్, అర్జున్, మురళి, కొల్లి రామ్‌చంద్, ఇంద్రతేజ, కలహర్‌రెడ్డి, రామ్‌కుమార్‌తోపాటు టాలీవుడ్‌లో మరికొందరికి సరఫరా చేస్తున్నాడు. వీరి దందాపై పక్కా సమాచారం అందుకున్న నార్కోటిక్ విభాగం అధికారులు మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీ చేసుకుంటున్న వెంకటరత్నారెడ్డి, మురళిని అరెస్ట్ చేసి, దర్యాప్తును వేగిరం చేశారు. నిందితులు స్నాప్‌చాట్‌లో ఆర్డర్లు తీసుకొని, కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.
కీలక సమాచారం సేకరణ
బెంగళూరులో ఉండే నైజీరియన్లు అమోబి చుక్వాడిముంగోల్(29), ఇక్బారే మైఖేల్(32), థామస్ అనాఘాక(49)లను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారినుంచి కొనుగోలుదారుల సమాచారం సేకరించారు. రామ్ పట్టుబడితే పెద్ద సంఖ్యలో డ్రగ్స్ వినియోగదారులకు సంబంధించిన సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు తరచూ వచ్చే పబ్‌ల యజమానులు కూడా వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా పబ్‌లకు వచ్చే వారిలో టాలీవుడ్‌కు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో వారినే టార్గెట్ చేసి, డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పరారీలో ఉన్న రామ్ కీలకం
రామ్ తప్పించుకొని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. రామ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన బాలాజీ నగరంలోని టాలీవుడ్ ప్రముఖులు సహా మొత్తం 40 మందికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రామ్ మరికొందరిని ఏజెంట్లుగా పెట్టుకొని పెద్ద స్థాయిలో డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లోనూ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. రామ్ పట్టుబడితే పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు అంటున్నారు.
ఇల్లెందు యువకుడి ఇంట్లో సోదాలు
డ్రగ్స్ విక్రయిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడిన సంఘటన కలకలం రేపుతోంది. ఇల్లెందులోని 7వ వార్డు నంబర్ 2 బస్తీకి చెందిన వికాస్ కొంతకాలంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా మత్తుపదార్థాలను విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతనిపై ఎస్‌టీఎఫ్ పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం గాజులరామారంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 5.6 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఇల్లెందులోని అతడి నివాసంలో సోదాలు చేశారు. టాలీవుడ్ నటుడు నవదీప్ శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నాడు. అయితే పోలీసులు అతడికి నోటీసులు జారీ చేసినప్పటికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడి మీద ఒత్తిడి తీసుకురావడంతో శనివారం విచారణకు హాజరు కాలున్నాడు. అయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరికి విక్రయిస్తున్నారు? ఎంతమంది వినియోగదారులు ఉన్నారు? ఈ దందాలో కీలక వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు నవదీప్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The police are trying hard to catch ram the main suspect in the drug case that is rocking tollywood
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com