Sankranthiki Vasthunnam: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కట్టిన సినిమా ఇది. 5 ఏళ్ళు, పదేళ్ల నుండి థియేటర్స్ కి వెళ్లని వాళ్ళు కూడా ఈ సినిమా కోసం థియేటర్ వైపు చూసారు. ఆ స్థాయి సునామీ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. నిన్న మొన్నటి వరకు కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త సినిమాల రాక కారణంగా దాదాపుగా కలెక్షన్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి కి వచ్చేసింది. గత వారం మొత్తం రోజుకి 30 లక్షల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూళ్లను రాబడుతూ వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు 12 లక్షలకు పడిపోయింది.
త్వరలో జీ తెలుగు లో ప్రసారం కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా కలెక్షన్స్ పై కాస్త ప్రభావం చూపించినట్టు అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయిల గ్రాస్ వచిన్నట్టు మూవీ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బయ్యర్స్ కి 300 కోట్ల రూపాయిల షీల్డ్స్ ని ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి అందించిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ సినిమా ఇంకా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టలేదు. చాలా దగ్గర వరకు ఆగిపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 285 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఆ 15 కోట్ల గ్రాస్ కూడా అదనంగా వచ్చి ఉండుంటే చాలా బాగుండేది అని ట్రేడ్ పండితులు అంటున్న మాట.
ఈమధ్య నిర్మాతలు తమకు వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువ చూపిస్తూ ప్రమోట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కి ఇలాంటి అలవాట్లు లేవు. కానీ దిల్ రాజు అత్యుత్సాహం తో అత్యధిక వసూళ్లు వేసి, వెంకటేష్ కి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేసారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. కనీసం ఇక్కడితోనైనా ఆపితే బాగుండును అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని అటు విక్టరీ వెంకటేష్, ఇటు అనీల్ రావిపూడి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. 2027 వ సంవత్సరం లో ఈ చిత్రం విడుదల చేస్తారట. ప్రస్తుతం డైరెక్టర్ అనీల్ రావిపూడి(Anil Ravipudi) ద్రుష్టి మొత్తం మెగాస్టార్ తో చేయబోయే సినిమా మీదనే ఫోకస్ చేస్తున్నాడు.